27-11-2025 12:30:10 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, నవంబర్ 26 : భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాల కంటే సర్వోన్నతమైనదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు.
భారత రాజ్యాంగం ఎప్పుడు నూతనమైనది, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు, చేర్పులను చేసుకొనే వెసులుబాటు మనకు కల్పించిందన్నారు. మన రాజ్యాంగం పరిధిలోకి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాన అవకాశాలు, సమాన అధికారాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కా ర్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.