19-05-2025 12:00:00 AM
సెప్టిక్ ట్యాంక్ మురుగునీరుతో కంపు కొడుతున్న పరిసరాలు
గజ్వేల్, మే18: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసి స్తున్న పేదల జీవనాలు చెత్తలోనే కొనసాగుతున్నాయి. గజ్వేల్ పట్టణ పేదల కోసం కేటాయించిన 1100 ఇళ్లల్లో ప్రస్తుతం లబ్ధిదారులతోపాటు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ లో ఇండ్లలో మున్సిపల్ కార్మికులు చెత్తను సేకరించకపోవడంతో ప్రజలు పరిసర ప్రాంతాల్లోనే చెత్తను పారవేస్తున్నారు.
దీంతో డబుల్ బెడ్ రూమ్ ప్రజల నివాస ప్రాంతాలన్నీ కూడా చెత్తతో నిండిపోయాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం సమిష్టిగా నిర్వహించిన సెప్టిక్ ట్యాంకులు కూడా నిండిపోయి మురుగునీరు చెత్తతో కలిసిపోవడంతో తీవ్రస్థాయిలో దుర్గంధం వెదజల్లుతుంది. అటు పిచ్చి మొక్కలు, ఇటు ప్రజలు వేసిన చెత్త, మరోవైపు సెప్టిక్ ట్యాంక్ మురుగునీరుతో పేద ప్రజల ఆవాసాలన్నీ అపరిశుభ్రంగా మారిపోయాయి.
ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాల పరిశుభ్రతను మరిచిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం కానున్న సమయంలో మున్సిపల్ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాల పరిశుభ్రత పట్ల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు చెత్త సేకరణ నిర్వహించడం తోపాటు, ప్రస్తుతం నా ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, సెప్టిక్ ట్యాంక్ ను కూడా క్లీన్ చేయాల్సి ఉంది.
లేనిపక్షంలో ఇవే పరిస్థితులు కొనసాగితే వర్షాకాలంలో ప్రజలంతా తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో పారిశుద్ధ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.