23-07-2025 09:41:27 PM
సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్..
హుజూర్ నగర్: బాలికలు బలహీనులమని భావించకూడదు.. ఆడవారిగా పుట్టినందున తాము అన్ని రకాలుగా మగవారి కంటే బలహీనులమని బాలికలు భావించవద్దని.. మానసికంగా శారీరకంగా తాము అతి ధైర్యవంతులమనే భావన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్(Civil Judge Radha Krishna Chauhan) బాలికలకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినుల వయస్సు కీలకమైనదని ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. తమ పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని ధైర్యంతో ప్రతిఘటించడంతో పాటు విషయాన్ని వెంటనే కుటుంబ పెద్దలకు తెలియపరచాలని మౌనం దాల్చటం సరికాదన్నారు.
బాలికలకు మాయమాటలు చెప్పి లోపర్చుకోవడానికి కొంతమంది దుష్టులు టక్కు టమారా విద్యలు ప్రదర్శిస్తారని వారి మాయలో పడవద్దు అన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ లింగ వివక్ష ఉండేదని ప్రస్తుతం అది నేరమన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం కుల మత ప్రాంత పరమైన వివక్ష చూపకూడదన్నారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన మాట్లాడుతూ బాలికలకు ఉచిత విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. సైబర్ క్రైమ్ నేరాల నుండి బాలికలు దూరం గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, ఏజీపీ బానోతు సురేష్ కుమార్, కోశాధికారి ఉప్పల గోపాలకృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ రెహానా బేగం, న్యాయవాదులు సైదాహుస్సేన్, ఉదారి యాదగిరి, బుడిగ నరేష్, న్యాయశాఖ, పోలీస్, సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.