23-07-2025 08:23:00 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): పచ్చదనం పెంపే లక్ష్యంగా జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరం 69 లక్షలు 55 వేల మొక్కలు నాటేలా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తెలిపారు.
ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో 44 శాతం మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, రాబోయే 15 రోజులలోపు మొక్కలు నాటే ప్రక్రియను పూర్తిచేయాలని, ప్రతి మొక్కను జియోట్యాగ్ చేయాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్ మొక్కల నాటుదలకు వ్యవసాయ శాఖ సహకారం తీసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. మొక్కలు నాటిన వెంటనే సంబంధిత వివరాలు అటవీ శాఖ అధికారులకు పంపించాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించిన కలెక్టర్, వెంటనే నిర్మాణాలను పూర్తి చేయాలని, మార్కౌట్ పూర్తి చేసిన ఇండ్లకు గ్రౌండింగ్ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు.
మేస్త్రీల కొరత ఉండకుండా తగిన సన్నాహాలు చేసుకోవాలని సూచించారు. ఇసుక కొరత రాకుండా తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఎఫ్‌ఓ నాగిని భాను, ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, డీఈఓ పీ. రామారావు, జెడ్పి సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఏడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్. సుదర్శన్ సహా పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.