calender_icon.png 24 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం

23-07-2025 09:05:59 PM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేసిన మొట్టమొదటి ప‌థ‌కం మహాలక్ష్మి పథకమని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం గొప్ప వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లి బస్టాండ్ లో డిపో మేనేజర్ ఇందూ అధ్యక్షతన నిర్వహించిన మహాలక్ష్మీ పథకం సంబురాల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులల్లో భూపాలపల్లి డిపో పరిధిలోనే 1,44,72,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఆర్టీసీకి మహాలక్ష్మీ ఆదాయం రూ.73,83,43,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు.

మహిళలకు ప్రయాణ భద్రత, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహాసోతోపేతమైన చొరవ వల్ల మహిళలు ఉచిత ప్రయాణం చేస్తూ చార్జీల డబ్బులు కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తున్నారని,  దీని వల్ల ఆర్థిక భారం తగ్గిందన్నారు. ఉచిత ప్రయాణం వల్ల అవసరమైన ప్రదేశాలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా  ప్రయాణిస్తున్నారన్నారు.  ఇది రాష్ట్ర ప్రభుత్వం  మహిళా సాధికారత దిశగా తీసుకున్న కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహాలక్ష్మి బస్సుతో మీ ప్రయాణం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భూపాలపల్లి నుండి దూదేకులపల్లి గ్రామానికి వయా కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్దారం మీదుగా బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం బస్సులో బాంబులగడ్డ వరకు ఆర్టీసీ డీఎం ఇందూ, జిల్లా ఆర్టీఐ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రయాణం చేశారు.