calender_icon.png 13 November, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాన‌సిక విక‌లాంగులు స‌మాజంలో భాగ‌మే!

13-11-2025 08:22:46 PM

జిల్లా క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య‌

సంగారెడ్డి: మానసిక వికలాంగతతో బాధపడుతున్న పిల్లలు మన సమాజంలో అంతర్భాగమ‌ని, వారికి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్టల్ గడ్డలో ఉన్న సహారా ప్రాథమిక పునరావాస కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రాలు ఏర్పాటుతో  వికలాంగత పిల్లలకు ప్రయోజనం కలుగుతుంద‌న్నారు. పిల్లల కోసం సంస్థ చేపడుతున్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలోని అంచున ఉన్న పిల్లలకు ప్రేమ, శ్రద్ధ, విద్య, ఆరోగ్యం అందించాలనే సంకల్పాన్ని బలపరుస్తూ సహారా కేంద్రం సేవలు వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి అని కలెక్టర్ అన్నారు.

సహారా కేంద్రం ఆదర్శప్రాయంగా ఉంది అని అభిప్రాయపడ్డారు. సహారా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిమారెడ్డి, డైరెక్టర్ శంకర్‌ కేంద్రం కార్యకలాపాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ త్వరలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఇన్‌క్లూజివ్ స్కూల్ ప్రారంభించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వారు వెల్లడించారు. సాధారణ విద్యార్థులు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కలిసి చదివే విధంగా ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో 50 మందికి పైగా పిల్లలు వివిధ థెరపీలను పొందుతున్నారని తెలిపారు. ఇతర సేవలతో పాటు, సహారా సంస్థ ఒక ఇన్‌క్లూజివ్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ వైద్య, మానసిక, శారీరక పునరావాస సేవలు పొందుతున్నారు. అలాగే వికలాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం వృత్తి శిక్షణా కేంద్రం ద్వారా హస్తకళలు, కంప్యూటర్ నైపుణ్యాలు, చిన్న వ్యాపార శిక్షణ వంటి కోర్సులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, తల్లిదండ్రులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.