20-08-2025 12:00:00 AM
ములకలపల్లి, ఆగస్టు 19,( విజయ క్రాంతి): ఎడతెరిపి లేకుండా గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో ఉన్న మూకమామిడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు మత్తడి పోస్తుంది. 24 అడుగుల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా రావడంతో అలుగు ద్వారా మిగులు నీరు బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిండా నిండి నీటితో కళకళలాడుతుండడంతో ప్రాజెక్టును చూడడానికి సందర్శకులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
సందర్శకుల రాకతో ప్రాజెక్టు దగ్గర సందడి వాతావరణం నెలకొంది. దీంతో పాటు మండలంలోని మొర్రేడు, పాములేరు, సాకివాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగుకు అవతల పక్కన ఉన్న అన్నారం, చింతలపాడు, గుర్రాలకుంట గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాలు, ఇతర అవసరాల కోసం నిత్యం వీరు వాగు దాటి పాల్వంచకు వెళ్తుంటారు.
ఈ మూడు గ్రామాల ప్రజలు వాగు దాటడానికి ప్రయత్నాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. ఏ అవసరం వచ్చినా గాని వాగు దాటకుండా పూసుగూడెం వైపు ఉన్న రహదారిని ప్రయాణం కోసం ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మండలంలో ఉన్న సాగునీటి చెరువులు,కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి.
ఈ వానలకు గ్రామాల్లోని అంతర్గత రహదారులు బురదమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. అనేక గిరిజన గ్రామాల్లో రహదారులు నడవడానికి అనుకూలంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత అంతర్గత రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.