10-01-2026 12:00:00 AM
సంగారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కసరత్తును యంత్రాంగం ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా సవరణకు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా తదనుగుణంగా తేదీలు కూడా ప్రకటించింది. ఈనెల 12న వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలని వెల్లడించింది.
అలాగే 16న తుది జాబితా ప్రకటించాలని ఈసీ ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఓటరు జాబితాతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. అధికారుల చర్యలను పరిశీలిస్తే మున్సిపల్ ఎన్నికలకు సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా నగారా మోగనన్నట్లు తెలుస్తోంది.
తుది జాబితాపై ఫోకస్...
ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని వార్డుల వారీగా ఈనెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన మున్సిపల్ అధికారులు తుది జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని సరిచేసే ప్రక్రియ చేపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఇటీవల ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితాపై మార్గనిర్దేశనం చేస్తూ తేదీలను ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈనెల 12న పట్టణంలోని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. మరుసటి రోజు(13న) పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే సరిచేసి 16న పోలింగ్ కేంద్రాలతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. ఓటర్ల జాబితాను గతేడాది నవంబర్ లో ప్రకటించిన మూడో సప్లిమెంటరీని అనుసరించి చేపట్టాల్సిందిగా స్పష్టం చేశారు.
ఆర్వోలు, ఏఆర్వోలు, జోనల్ ఆఫీసర్ల నియామకాలు సైతం త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు ఓటరు జాబితా తయారీకి నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసిన ఈసీ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. తాజాగా కలెక్టర్లతో వీసీ నిర్వహించి స్పష్టమైన తేదీలు ప్రకటించడంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
అభ్యంతరాలపై విచారణ..
ముసాయిదా ఓటర్ల జాబితాలో దొర్లిన పొరపాట్లపై మున్సిపల్ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఓటర్ల వార్డుల తారుమారు, మృతుల పేర్లు జాబితాలో ఉండటంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తమకు కేటాయించిన వార్డులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేస్తున్నారు. ఓటర్లు స్థానికంగానే ఉంటున్నారా అనే దానిపై ఆరా తీయడంతో పాటు వారు నివాసముండే ఇంటి నంబర్లు, ఓటర్ ఎపిక్ కార్డులను పరిశీలిస్తున్నారు. సేకరించిన సమా చారంతో వార్డులోని ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేస్తున్నారు.