calender_icon.png 12 January, 2026 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త వినోదాత్మక చిత్రం అనగనగా ఒక రాజు

12-01-2026 02:24:44 AM

టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి వెండితెరపై మరో అద్భుతమైన మాయాజాలం చేయడానికి సిద్ధమయ్యారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అందాల నటి, ’గుంటూరు కారం’ నుంచి నేటి ’అనగనగా ఒక రాజు’ వరకు ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.  ’అనగనగా ఒక రాజు’సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షి పంచుకున్న ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే..

ఈ ఏడాది సంక్రాంతికి కూడా మీ సినిమా రావడం ఎలా అనిపిస్తోంది? 

చాలా సంతోషంగా ఉంది. గతేడాది పండగ విజయం నాకు ఎంతో గుర్తింపునిచ్చింది. ఇప్పుడు ’అనగనగా ఒక రాజు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది.

మీ పాత్ర పేరు, దాని స్వభావం గురించి చెబుతారా? 

సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత ప్రపంచంలో బతికే యువరాణి లాంటి పాత్ర ఇది.

ఈ పాత్ర కోసం మీరు చేసిన ప్రత్యేక కసరత్తులు ఏంటి? 

ఈ పాత్ర నా నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత మాత్రం ఎమోషనల్ గా కనిపిస్తుంది. 

నవీన్ పొలిశెట్టితో నటించిన అనుభవం ఎలా ఉంది? 

నవీన్ గారితో వర్క్ చేయడం ఒక సినిమా స్కూల్లా అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన పంచ్ డైలాగ్స్ కు ధీటుగా రియాక్ట్ అవ్వడం నాకు సవాలు.

గత చిత్రాల కామెడీకి, ఈ సినిమా కామెడీకి తేడా ఏంటి?

 గతంలో నేను చేసిన పాత్రలు కాస్త సీరియస్‌గా ఉండేవి. ఇందులో నా పాత్ర పూర్తిస్థాయి కామెడీతో సాగుతుంది. నవీన్ టైమింగ్‌కు తగ్గట్టుగా కామెడీ పండించడం కొత్తగా అనిపించింది.

ఈ చిత్రం మీ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? 

ఇలాంటి పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రం వల్ల నటిగా నాలో మరో కొత్త కోణం బయటకు వస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విభిన్న పాత్రలు చేయడానికి ఈ సినిమా నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

మీ డ్యాన్స్ నెంబర్స్ గురించి ఏమైనా చెబుతారా? 

భీమవరం బాల్మా, రాజు గారి పెళ్లిరో వంటి మాస్ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సాధారణంగా నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడతాను. కానీ ఈ పాటల చిత్రీకరణ సమయంలో ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ చేశాను.

గోదావరి ప్రాంతంలో షూటింగ్ 

చేసిన అనుభవాలు ఎలా ఉన్నాయి? 

అక్కడి షూటింగ్ రోజులు నా జీవితంలో గుర్తుండిపోతాయి. ప్రజలు చూపించిన ప్రేమ, రుచికరమైన వంటకాలు నాకు బాగా నచ్చాయి. అక్కడ ఉన్న కొన్ని పురాతన ఆలయాలను కూడా సందర్శించాను.

ఏ అంశాల ఆధారంగా సినిమాల చేస్తారు?

నాకు కథే ముఖ్యం. దర్శకుడు ఆ పాత్రను ఎలా తీర్చిదిద్దారో చూస్తాను. హీరో ఎవరనే దానికంటే ఆ పాత్ర నా కెరీర్ కు ఎంత ప్లస్ అవుతుందనేది ఆలోచిస్తాను.

సితార ఎంటర్టైన్మెంట్స్‌లో వరుస సినిమాలపై స్పందన? 

సితార సంస్థ నాకు ఒక సొంత కుటుంబంలా మారిపోయింది. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో వారు ఎప్పుడూ ముందే ఉంటారు. ఆ బ్యానర్ లో వరుస ఆఫర్లు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

దర్శకుడు మారి పనితీరు ఎలా ఉంది? 

ఆయనకు సినిమాపై పూర్తి స్పష్టత ఉంది. నూతన దర్శకుడు అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా పనిచేశారు. ఎన్ని టేక్స్ తీసుకున్నా నవ్వుతూనే నటనను రాబట్టుకున్నారు.

మీ తదుపరి చిత్రాల వివరాలు ఏంటి? 

జవాబు: ప్రస్తుతం నాగచైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికరమైన కథలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాను.