12-01-2026 02:13:43 AM
హీరో విజయ్ దేవరకొండ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లలో రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై హీరో విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఒకవైపు కోర్టు ఆదేశాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే, మరోవైపు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సిని మా వెనుక మూవీ టీమ్ పడే కష్టం, భారీ పెట్టుబడి, వారి కలలను కోర్టు తీర్పు ద్వారా రక్షించుకోవడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
అయితే మనవారే మన సినిమాలకు పనిగట్టుకుని హాని చేయాలని చూడటం తనను ఎంతో కలిచివేస్తోందని విజయ్ దేవరకొండ ఆవేదన చెందారు. మనం అందరం కలిసి ఎదగాలనే భావన, ఒకరికొకరు తోడ్పడాలనే స్ఫూర్తి క్రమంగా కనుమరుగవుతున్నాయని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడి సినిమా కూడా ఇలాంటి కుట్రల వల్ల ప్రమాదంలో పడుతుందని కోర్టు గుర్తించడం గమనార్హమని ఆయన అన్నారు. తన కెరీర్లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా సమయం నుంచే సినిమాలను దెబ్బతీయాలని కొందరు చేస్తున్న రాజకీయాలను తాను గమనిస్తూనే ఉన్నానని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా తాను ఈ విషయంపై మాట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, మంచి సినిమాను ఏ కుట్ర ఆపలేదని తాను నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. సినిమాలపై కుట్రలు చేసే ముఠాల వల్ల తనతో పనిచేసే నిర్మాతలకు, దర్శకులకు కలిగే నష్టాలను చూసి చాలా రాత్రులు నిద్రలేకుండా గడిపానని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు. ఈ గ్యాంగ్స్ ఎవరు, ఎందుకు సినిమాలను లక్ష్యంగా చేసుకుంటున్నారో అర్థం కాక ఆందోళన చెందేవాడినని తెలిపారు.