calender_icon.png 28 August, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగిపొర్లుతున్న మోయ తుమ్మెద వాగు.. రాకపోకలు నిలిపివేత

28-08-2025 06:37:48 PM

నంగునూరు: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని సమీక్షించడానికి నంగునూరు తహసీల్దార్ జి. సరిత(Tehsildar Saritha) వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వాగు ఉధృతి కారణంగా ఖాతా, ఘనపూర్ గ్రామాలకు వెళ్లే వంతెన(బ్రిడ్జి) పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు నంగునూరు - ఘనపూర్, ఖాతా - (జాలపల్లి) - నంగునూరు మార్గాల్లో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణ మార్గాలకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపివేశారు. అంతేకాక, అక్కెనపల్లి - బస్వాపూర్ మార్గంలో ఉన్న వాగు కూడా వంతెనపై నుంచి పొంగిపొర్లుతోంది.

వాగులో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ఎవరూ ఈ మార్గాల్లో వెళ్లవద్దని తహసీల్దార్ సరిత హెచ్చరించారు.సెల్ఫీలు తీసుకోవడం లేదా చేపల వేట కోసం వెళ్లి ప్రాణాలకు ప్రమాదం కొనితెచ్చుకోవద్దని తహసీల్దార్ సరిత ప్రజలకు సూచించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాల వల్ల ఏమైనా నష్టం జరిగితే, వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08457230000 లేదా మండల తహసీల్దార్ నంబర్ 8978180312కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ పర్యటనలో గిర్ధావర్ లింగం తదితరులు పాల్గొన్నారు.