calender_icon.png 29 August, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన రహదారిపై అలుగు పారుతున్నా పట్టించుకోరా...?

28-08-2025 10:06:13 PM

లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కల్వర్టు వృధా!

ఈ నిర్మాణంతో ఎవరికి ప్రయోజనం..?

ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తున్న కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు కనపడటం లేదా...?

వనపర్తి ఉన్నతాధికారుల తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం

బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి టౌన్: కలెక్టరేట్ కు అతి సమీపంలోనే ఉన్న వనపర్తి- పెబ్బేరు ప్రధాన రహదారిపై అలుగు నీరు పారుతున్నా అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోవడం లేదని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్(Rachala Yugandhar Goud) ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వనపర్తి పట్టణం మర్రికుంట సమీపంలో ప్రధాన రహదారిపై పారుతున్న అలుగు నీటిని అక్కడి డ్రైనేజీ వ్యవస్థను, ఇతర కాలువలను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా కల్వర్టులు, బ్రిడ్జిలు.. కింద నుంచి కాలువలో, డ్రైనేజీలు, తూములో, వాగులో వెళ్తుంటే కడతారని, కానీ పక్కనే కుంట ఉన్నా.. దాని నుంచి ఇటు వచ్చే కాలువను ఏనాడో పూడ్చేసినా.. కాలువ లేకున్నా... తూము లేకున్నా... వేసవిలో ఏ అత్యవసర పనులు లేనట్లుగా కల్వర్టు నిర్మించి లక్షలాది ప్రజాధనం వృధా చేశారని అధికారుల తీరుపై మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులు నిత్యం ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారని, కనీసం కాల్వ లేదని వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు.

మర్రికుంట చెరువు అలుగు పారితే వచ్చే నీరు వనపర్తి-కర్నూలు ప్రధాన రహదారి బీటీ రోడ్డుపై నుంచే అమ్మ చెరువులోకి వెళ్తుందని, నిజానికి కల్వర్టు నిర్మాణం ఈ ప్రాంతంలో చేసి ఉంటే బాగుండేది కానీ కొందరు అవగాహన లేని  అధికారులు ఏళ్ల క్రితమే మూసుకుపోయిన తూము కాల్వ పేరుతో రెండు ఇళ్ల మధ్యన ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం చేపట్టారని, దీంతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందనేది జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపితే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. అభివృద్ధి పేరిట నిర్మించిన కల్వర్టు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని, ప్రజా ధనాన్ని వృధా చేసిన ఉన్నతాధికారుల తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఈ విషయంపై వనపర్తి మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి ఎక్జిక్యూటివ్ ఇంజనీరుతో ఫోన్లో సంప్రదించగా వారు దాటవేత ధోరణితో సమాధానమిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే  వెంటనే స్పందించి...సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, మదనాపూర్ మండల కన్వీనర్ నరసింహ యాదవ్, నాగరాజు, నరేందర్ సాగర్, కృష్ణ ప్రసాద్, యశ్వంత్, ధనుష్ గౌడ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.