calender_icon.png 29 August, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా ఉగ్రరూపం.. రవాణా అస్తవ్యస్తం

28-08-2025 09:59:43 PM

చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ 

పోచారం వరద ముప్పుతో పునరావాస కేంద్రాలకు ప్రజలు

పాపన్నపేట: ప్రశాంతంగా ఉన్నటువంటి మంజీరా నది(Manjira River) ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షం కారణంగా మంజీరా నది ఉగ్ర మంజీరాగా మారి ఉరకలెత్తింది. అకాల వర్షాల కారణంగా మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలను నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా మట్టుకు ఇండ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా పోచారం ప్రాజెక్టు వరద బీభత్సం సైతం మంజీరాకు తోడు అవడంతో పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి, ఆరేపల్లి, కుర్తివాడ, ముద్దాపూర్ తదితర గ్రామాల్లో ముంపు ఉన్నటువంటి ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకుగాను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గాంధారిపల్లి ఆరేపల్లి కుర్తివాడ గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మండలంలోని చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ 

అకాల వర్షాల కారణంగా వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో మండలంలోని చెరువులు వాగులు కుంటలు పొంగిపొర్లాయి. మండలంలోని చాలా చెరువులు అలుగులు కారణం వల్ల ఆయా గ్రామాల్లో రహదారుల ప్రయాణం కష్టమైంది. యెల్లాపూర్ వంతెనపై నుండి మంజీరా నది నీరు ప్రవహించడం వల్ల మెదక్–బోడమట్పల్లి రోడ్డుపై రాకపోకలు నిషేధించారు. మిన్పూర్–పాపన్నపేట మధ్య నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ రోడ్డుపై నీరు పారడంతో రవాణా నిలిచిపోయింది. చీకోడె–కొంపల్లి మధ్య చెరువు అలుగు రహదారిపైకి రావడంతో రాకపోకలు ఆగిపోయాయి. నర్సింగి–అర్కెల మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారి మూసివేయబడింది. లింగాయిపల్లి–యెల్లుపేట రహదారిపై నీరు చేరడంతో ప్రజలు ప్రయాణం కష్టమైంది. అన్నారం–అన్నారం తాండా మధ్య వాగు పొంగడంతో తాండా ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి. ఇబ్బందులున్నటువంటి ప్రాంతాల్లో మండల ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరు ఆ రోడ్లపై ప్రయాణాలు చేయకుండా ఉండేందుకుగాను అవసరమైన బార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకున్నారు

పోచారం వరద ముప్పుతో పునరావాస కేంద్రాలకు ప్రజలు

సింగూర్ వరదతో పాటు హల్దీ వాగు నుంచి వస్తున్న వరద మంజీర నదిలో కలవడం వల్ల నది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీనికి తోడు పోచారం ప్రాజెక్టు నుంచి సైతం లక్షన్నర క్యూసెక్కుల నీరు మంజీరా నదిలో కలవడం వల్ల మంజీరా ప్రవాహం ఉధృతంగా సాగింది. దీంతోపాటు పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉందనే పుకార్లు షికారు చేయడంతో అధికారులు ముంపు ప్రమాదం ఉన్నటువంటి గాంధర్ పల్లి, ఆరేపల్లి, కుర్తివాడ తదితర గ్రామాలను అలర్ట్ చేశారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు రాత్రివేళలో సైతం గ్రామాల్లోని ప్రజలను పునరావాస క్రేంద్రలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. గాంధారి పల్లి లోని ముంపు ప్రాంత ప్రభావిత ప్రజలను లక్ష్మీ నగర్ ఎస్ ఆర్ గార్డెన్ లోకి, ఆరేపల్లి, కుర్తివాడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను స్థానిక పాఠశాలల్లోనికి తరలించి తగిన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను తాసిల్దార్ సతీష్ కుమార్ ఎంపీడీవో విష్ణువర్ధన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేశారు.

వందల ఎకరాల్లో వరి పంట నష్టం 

అకాల వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. మంజీరా నది ప్రభావ ప్రాంతాలైనటువంటి కొడపాక పొడిచిన పల్లి గాంధారి పల్లి ఆరేపల్లి కుర్తివాడ మిన్పూర్ ముద్దాపూర్ చికోడ్ కొంపల్లి గ్రామాలలో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏడుపాయలకు తగ్గని మంజీరా ప్రవాహం  

14 రోజులుగా రాజగోపురంలోనే వనదుర్గమ్మకు పూజలు

గత రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలకు మంజీరా ప్రవాహం తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అతిభారీ వర్షాలకు మంజీరా గేట్లు ఎత్తడంతో వరద క్రమంగా పెరిగింది. దీంతో అధికారులు ఏడుపాయల వనదుర్గ మాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలోనే ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.వర్షాలు తగ్గుముఖం పట్టి, ఎగువ సింగూరు ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం తగ్గగానే యధావిధిగా ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో వన దుర్గ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గణపురం వనదుర్గ ప్రాజెక్టుకు సింగూర్ నుంచి భారీగా వరద రావడంతో పోలీసులు వనదుర్గా ప్రాజెక్ట్ వద్ద, దేవస్థానం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.