20-06-2024 12:00:00 AM
దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. గత నెల రోజులుగా ఉత్తరాదిన ముఖ్యంగా ఢిల్లీలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉఫ్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఉక్కపోతకు తోడు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క ఢిల్లీ ప్రజలు అల్లాడి పోతున్నారు. సంపన్నులు నివసించే చాణక్యపురి, వపంత్ విహార్ లాంటి ప్రాంతాలు సైతం నీటి కొరతతో అల్లాడి పోతున్నాయి. ఇక మురికివాడల ప్రజల అవస్థలు చెప్పనలవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి ఏ మూలకూ చాలడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు విపరీతంగా ధరలు పెంచేసి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో వేసవి తీవ్రత ఉందని, మానవతా దృష్టితో నగరానికి అదనంగా నీటిని విడుదల చేసేలా హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలను ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అదనంగా నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, హిమాచల్‌ప్రదేశ్ చేతులెత్తేసింది. ఢిల్లీ నగరానికి ప్రధానంగా యమునా నదినుంచి తాగునీరు సరఫరా అవుతుంది. హర్యానాలోని బవనానుంచి కాలువద్వారా ఢిల్లీ హైదర్‌పూర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ప్రతి రోజూ వెయ్యి మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా కావాలి.
ఇప్పుడు దాదాపు 900 మిలియన్ గ్యాలన్ల నీరే సరఫరా అవుతోందని రాష్ట్రంలో అధికారంలో ఉన్న ‘ఆప్’ ఆరోపిస్తోంది. ఈ కొరతను అధిగమించడానికి ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం హర్యానా ప్రభుత్వంతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. నగర ప్రజలు ఉదయాన్నే క్యాన్లు, బిందెలు పట్టుకుని రోడ్లపై వాటర్ ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. నీటి పైప్‌లైన్లకు పోలీసు పహరా ఏర్పాటు చేయాల్సినంతగా పరిస్థితి దిగజారింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. చివరికి ఈ నెల 21లోగా సమస్యను పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిస్తూ రాష్ట్రమంత్రి అతీశి ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు.
పదేళ్ల క్రితం ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతి సంవత్సరం ఢిల్లీలో వేసవిలో నీటి కొరత ఎదురవుతూనే ఉందని నగర ప్రజల ఆరోపణ. అయితే, వేసవి తీవ్రత పెద్దగా లేకపోవడంతో సమస్య అంతగా కనిపించలేదు. కానీ, ఈసారి నెల రోజులకు పైగా ఉత్తరాది అంతటా ఎండలు మండి పోతున్నాయి. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడం కూడా దీనికి తోడయింది. రుతు పవనాలు దేశంలో ప్రవేశించి మూడు వారాలు కావస్తున్నా ఉత్తరాదిన వాన జాడే లేదు. ఇవన్నీ సమస్యకు ఒకవైపు కారణాలయితే మరోవైపు రాజకీయాలు దీన్ని మరింత జటిలం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు ఆప్ ప్రభుత్వంలోని కీలక నేతలు జైల్లో ఉండడంతో ఢిల్లీలో పరిపాలన కుంటుపడింది. ఇంకోవైపు ఈ ఏడాది చివర్లో రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ ఈ సమస్యను ఎన్నికల అస్త్రంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలమధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది తప్ప, సమస్య పరిష్కారం దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. నిజానికి ఢిల్లీలో ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారం అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలోనే ఉంది. పైగా ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ నియోజక వర్గాల్లోను బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు.
ప్రజా ప్రతినిధులుగా వారు ఆప్ ప్రభుత్వానికి తోడ్పాటు అందించడం మాట అటుంచి ఆందోళనల బాట పడుతున్నారు. కేంద్రమయినా రాజధానిలోని దాదాపు కోటిన్నర మంది ప్రజల సమస్యను దృష్టిలో ఉంచు కుని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి నచ్చజెప్పి అదనపు నీటిని విడుదల చేయడానికి యత్నించవచ్చు. కానీ, ఆ పని చేయడం లేదు. దాంతో పదవీ రాజకీయాలకు సామాన్య ప్రజలు బలయిపోతున్నారు.