20-06-2024 12:05:00 AM
యుద్ధాల వల్ల, కులమత వర్ణ వివక్షతల వల్ల లేదా మరో ఇతర కారణాలతో హింసాత్మక చర్యలను సృష్టించడం ద్వారా కొందరు వ్యక్తులు లేదా కుటుంబాలు ప్రాణభయంతో సొంత దేశాలను వదిలి వేరే దేశాలకు వెళ్లి తలదాచుకుంటారు. అలాంటి వారినే ‘శరణార్థులు’గా పిలుస్తారు. ఇటువంటి సంఘటనలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువగా వున్నా ప్రస్తుతం కూడా ఎక్కడో ఒకచోట ఆహారం లేదా నివాసం కోసం బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇలాంటి వారు. వీరిని ఆదుకోవడానికే ప్రతీ సంవత్సరం జూన్ 20న ‘ప్రపంచ శరణార్థుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు.
శరణార్థుల గురించి అవగాహన, సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ‘ఐక్యరాజ్యసమితి’ 1950 డిసెంబర్ 14న ‘ఐరాస శరణార్థుల సంస్థ’ని ఏర్పాటు చేసింది. అనేక దేశా ల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాల కారణంగా అనేకమంది ప్రజలు నిర్వాసితులై శరణా ర్థులుగా మారుతున్నారు. ఈ పరిణామాలవల్ల ఐరాస జనరల్ అసెంబ్లీ 2000 డిసెంబరు 4న సమావేశమై ప్రతి ఏడాది జూన్ 20న ‘అంతర్జాతీయ శరణార్ధుల దినోత్సవం’ జరపాలని తీర్మానించింది.
ఈరోజు శరణార్థులందరినీ గౌరవించడం, వారి గురించి అవగాహన పెంచడం, మద్దతు తెలపడం వంటి కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇతర అంతర్జాతీ య దినోత్సవాల మాదిరిగా ఇది ఉత్సవాలు జరుపుకునే రోజు కాదు. శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అమానవీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్ని టిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలిపి, అవగాహన కల్పించవలసి ఉంది.
యుద్ధం, హింస కారణంగా వారి స్వస్థలం నుండి పారిపోయి వచ్చిన వారిని ఆదరించి కావలసిన బతుకుదెరువు చూపెట్టడం అన్నది కనీస మానవ ధర్మం. ఆయా దేశాలలోని శరణార్థులు నివాస సౌకర్యాలు, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం, జీవనోపాధి కొరత, స్థావరాలలో అంటువ్యాధులు ప్రబలడం, స్త్రీలు, బాలికలపై లైంగిక వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరణార్థులు ఎక్కువ దూరం వెళ్లకుండా తమ పొరుగు దేశాలకు వెళ్లడం, 80% పేదదేశాలలో స్థావరాలు ఏర్పరచుకోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వస్తుంది. శరణార్థులు రకరకాలుగా ఉంటారు. ఎవరైనా, వారు ఎలాంటి వారైనా మానవతా దృక్పథంతో వారి సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయవలసి ఉంది.
గడప రఘుపతిరావు