calender_icon.png 18 August, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ మౌనం వీడాలి

20-06-2024 12:05:00 AM

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న 23 లక్షల మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజున (జూన్ 04) విడుదలైన నీట్ ఫలితాల ఆధారంగా పరీక్ష నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లిక్ అయిందని అర్థంకాక మానదు. దేశంలో అత్యంత కఠినంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నీట్’లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 62 మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చి ఫస్ట్‌ర్యాంక్ సాధించడం అనూహ్యమే. అందులో 8 మంది విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ నుంచి సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోవడమేకాక ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు.

అలాంటిది ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందన్నది అందరినీ తొలిచే ప్రశ్న. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి మరీ సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటమంటే  ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ ) కుట్రలా కనిపిస్తున్నది. దేశ ప్రజలు, విద్యార్థుల, దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉండగా ఎన్టీఏ నీట్ ఫలితాలను విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఫలితాల అవకతవకలపై తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్టీఏ చాలా చిత్రమైన సమాధానాలు ఇచ్చింది. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు పేర్కొంది. అసలు నీట్ లాంటి ఎగ్జామ్స్‌కు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు.

ఎందుకిలా చేశారో?కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనేక అనుమానాలకు ఆస్కారం కలుగుతున్నది. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ విద్యార్థులకు గ్రేస్ మార్కులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్‌నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోంది. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానా తంటాలు పడుతుంది. ప్రతిసారి విద్యార్థులతో ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడక పోవడం విద్యార్థులపట్ల ఆయన చిత్తశుద్ధిని శంకించవలసి వస్తున్నది.

గడ్డం శ్యామ్

రాష్ట్ర ఉపాధ్యక్షులు, పీడీఎస్‌యూ