1 July, 2026 | 5:17 AM

గజం భూమి ధర 2.98 లక్షలు

12-06-2025 01:50 AM

కేపీహెచ్‌బీ కాలనీలో రికార్డుస్థాయిలో ధరలు

18 స్థలాల విక్రయంతో హౌజింగ్ బోర్డుకు భారీ ఆదాయం

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం రూ.2.98 లక్షలు పలికింది. ఇంత భారీగా ధర పలకడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని హౌజింగ్ బోర్డు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధిలో ఉందని, దానికి భూముల ధరలే నిదర్శమని అభిప్రాయపడ్డారు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీఫేజ్‌ేొ7లో ఖాళీగా ఉన్న 18 స్థలాలకు స్థానిక కమ్యూనిటీ హాల్‌లో బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. 198 గజాల నుంచి 987 గజాల వరకు విస్తీర్ణం ఉన్న ప్లాట్ల విక్రయం కోసం నిర్వహించిన వేలం పాటలో 22వ నెంబర్ ప్లాట్‌కు బిడ్డర్లు చదరపు గజానికి రూ.2.98 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చి, కొనుగోలు చేశారు.

ఈ ప్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు. వేలంపాట ద్వారా హౌజింగ్ బోర్డుకు సుమారు రూ.142.78 కోట్ల మేర ఆదాయం వస్తోందని చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ 18 ప్లాట్లకు సంబంధించి మొత్తం 6,232 చదరపు గజాలను వేలం వేయగా సగటున ఒక్కో గజానికి రూ.2.38 లక్షలు పలుకగా, 22 ప్లాట్లకు సంబంధించి మాత్రం రూ.2.98 లక్షల ధర పలకడం విశేషం. ఈ వేలం పాటలో భూములు కొనుగోలు చేసిన వారు 2 రోజుల్లో నాలుగో వంతు సొమ్మును చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో హౌజింగ్ బోర్డుకు రూ.35.34 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నట్టు అధికారులు వెల్లడించారు.