25-07-2025 02:19:48 AM
వర్షాలకు జలమయమవుతున్న నగరం
కరీంనగర్, జూలై 24 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయి. భారీ వర్షా లు కురిసినప్పుడు మోకాళ్ల లోతు నీళ్లు పలు ప్రాంతాల్లో ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రధాన డ్రైన్లలో సిల్ట్ తొలగించకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఈ వర్షానికి కలెక్టరేట్ సమీపంలోని స్మార్ట్ సిటీ రోడ్, సాయికృష్ణ థియేటర్ రోడ్, విద్యానగర్ లోని శివ టాకీస్ ప్రాంతం, వేములవాడ రోడ్లోని రాంనగర్ ప్రాంతం, జగిత్యాల రోడ్లో ని విపార్క్ సమీపంలోని ప్రధాన రహదారులు పొంగిపొర్లాయి. కరీంనగర్ లో గత ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బి కింద జగిత్యాల రోడ్, మంచిర్యాల రోడ్, వేములవాడ రోడ్, హైదరాబాద రోడ్లను ఆధునీక రించి ఇరువైపులా డ్రైన్లను నిర్మించారు.
స్మార్ట్ సిటీ కింద నగరంలోని 11 రహదారులను అభివృద్ధి చేశారు. వీటి నిర్మాణ సమ యంలో కూడా ఇరువైపులా డ్రైన్లను నిర్మించారు. డ్రైన్లను నిర్మించిన క్రమంలో డ్రైన్లపై పైకప్పులు వేసి సుందరీకరించారు. అయితే ఈ డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ ను తొలగించని కారణంగా వర్షపునీరు డ్రైన్ల నుండి వెళ్లకపోవడమే కాకుండా డ్రైన్లో నీరు కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ము ఖ్యంగా ఆర్‌అండ్ బి రోడ్లు నిర్మిస్తున్న సమయంలో ప్రధాన డ్రైన్లలో పేరుకుపోయిన కాంక్రీట్, చెత్తను తొలగించకుండానే పైకప్పులు నిర్మించారు. ప్రతియేడు కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది తప్పడం లేదు. వర్షాలు కురిసిన ప్రతిసారి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైన ప్రధాన రోడ్లపై భారీకేడ్లు ఏర్పాటు చేసి రహదారులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్ అండ్ బి, నగర పాలక సంస్థల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకైనా అధికారులు తేరుకోలేదు. ప్రధాన డ్రైన్ల సిల్ట్ తొలగించకుంటే మున్ముం దు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడమే కాక ప్రధాన రహదారులకు కింది భాగాన లోత ట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం లేకపోలేదు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరుకుంది. గతంలో ముకరంపుర, శర్మనగర్, కట్టరాంపూర్ లు మా త్రమే లోతట్టు ప్రాంతాలుగా ఉండేవి.
స్మార్ట్ సిటీ రోడ్లు, ఆర్‌అండ్ బి రోడ్లు విస్తరించే క్రమంలో రోడ్లను ఎత్తుకు పెంచడం వల్ల వర్షాకాలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూ డా నీరు నిలిచిపోతుండడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ వద్ద కు రుస్తున్న వర్షాల కారణంగా ఆ రోడ్ నుండి భగత్ నగర్ వెళ్లడానికి బస్టాండ్ ప్రధాన రహదారి, అంబేద్కర్ స్టేడియం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. కలెక్టరేట్ ముందు సాయికృష్ణ థియేటర్ ముందు భా గాన గల రోడ్లు కూడా జలమయమవుతుండడంతో ఆ ప్రాంతవాసులు బయటకు రా లేని పరిస్థితులు నెలకొంటున్నాయి.
బుధవారం రాత్రి పలు ద్విచక్రవాహనాలు నీటి లో చిక్కుకున్నాయి. బండ్లను వదిలి అక్కడి నుండి వాహనదారులు వర్షం వెలిసే వరకు వేచి చూడాల్సి వచ్చింది. నగరపాలక సంస్థ అధికారులు ఆర్‌అండ్ బి సమన్వయంతో సిల్ట్ తొలగించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టకుంటే మున్ముందు నగరవాసు లకు రోడ్లుపై ప్రయాణం నరకంగా మారే పరిస్థితులుఏర్పడనున్నాయి.