10-01-2026 01:27:37 AM
హైదరాబాద్, జనవరి ౯(విజయక్రాంతి): తాము అధికారంలోకి వస్తే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను చెల్లిస్తామని, ఫీజుల రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలైన ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం హైదరాబాదులోని బీసీ భవన్‌లో బీసీ విద్యార్థి సంఘం జాతీయ కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.
గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు అలాగే ఈ ప్రభుత్వం రెండేళ్లు మొత్తం ఐదు సంవత్సరాలుగా ఫీజుల రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే సంక్రాంతి పండుగ తర్వాత వేలాదిమంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు ఎం చంద్రశేఖర్, జాజుల లింగం, బి మని మంజరి, డాక్టర్ రమ, ఇంద్ర రజక, పిట్ల శ్రీధర్,గూడూరు భాస్కర్, కాంపాటి వెంకట్, సంధ్యారాణి, సుజాత, వెంకటేష్ గౌడ్, రాజు పాల్గొన్నారు.