calender_icon.png 5 August, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలీవుడ్‌లో థర్టీ పర్సెంట్ వేడి!

04-08-2025 12:05:39 AM

‘మూడేళ్లకోసారి 30 శాతం పెంపు’ ఒప్పందంపై మాట మార్చిన నిర్మాతలు 

-ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచితేనే పనిలోకి.. 

-సోమవారం నుంచే కార్మికుల నిర్ణయం అమలులోకి.. 

సినిమా ప్రతినిధి, ఆగస్టు ౩ (విజయక్రాంతి): తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ రగల్ జెండా ఎగిరింది. సినీ కార్మికులు సహాయ నిరాకరణకు పూనుకుంటున్నారు. ‘మూడేళ్లకోసారి 30 శాతం పెంపు’ ఒప్పందంపై నిర్మాతలు మాట మార్చడంతో వేతన కష్టాల పరిష్కారం దిశగా కార్మికులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచితేనే పనిలోకి వస్తామని, లేకపోతే షూటింగ్‌లకు హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ నిర్ణయం సోమవారం నుంచే అమలవుతుందంటూ ప్రకటన జారీ చేశారు. దీంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ‘థర్టీ’ డిగ్రీ వేడి రాజుకున్నట్టయ్యింది. 

సినీ కార్మికుల వేతనాలు పెంపు విషయమై.. ఇటీవల ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలని ఒప్పుకున్న ఫిల్మ్ మేకర్స్.. ఆ నిబంధనలు తుంగలో తొక్కిపెట్టారు. సినీకార్మికులకు గడిచిన మూడేళ్లుగా ఎలాంటి జీతాభత్యాల పెంపు జరగలేదు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. గత నెల జూన్ 30వ తేదీతో మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా నిర్మాతల మండలి ఈ ఊసే ఎత్తలేదు.

దీంతో కార్మిక సంఘం నేతలు సంప్రదించటం.. వేతనాలు 5 శాతమే పెంచుతామంటూ ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ పెద్దలు చావు కబురు చల్లగా చెప్పటం జరిగిపోయాయి. ఇది తమకు సమ్మతం కాదని, ‘మూడేళ్లకోమారు 30 శాతం’ ఒప్పందం ప్రకారం పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. తమ అభ్యర్థనను అర్థం చేసుకొని, తమకు అనుకూలంగా వేతనాలు పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్స్‌కు మాత్రమే హాజరవుతామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచే తమ నిర్ణయం అమలవుతుందని కూడా హెచ్చరికగా చెప్పారు. దీంతో వేతనాలు ఎంత శాతం పెంచాలనే విషయమై కొంత సమయం అవసరమని..  రెండుమూడు రోజుల్లో తెలియజేస్తామని ఫిల్మ్ మేకర్స్ తరఫు వారు తెలియజేశారు. 

ప్రస్తుతం సినిమాలకు ప్రేక్షకాదరణ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇలాంటి సమయంలో కార్మికులు 30 శాతం పెంచాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు టాలీవుడ్ నిర్మాతలు. అంతలోనే కార్మికులు రగల్ జెండా ఎత్తేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు 24 కార్మిక సంఘాల నాయకులకు సూచనలు చేస్తూ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

అల్లరి నరేశ్ సినిమా వాయిదా.. 

టాలీవుడ్‌లో ‘థర్టీ’ డిగ్రీ సెగలు అప్పుడే వ్యాపించాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాల ప్రభావం ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోంది. హీరో అల్లరి నరేశ్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. కానీ, ఫెడరేషన్ నిర్ణయం అనంతరం ఆ చిత్రబృందం ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. 

ఫెడరేషన్ నిర్ణయాలు ఇవీ..

-వేతన పెంపు సమన్వయ కమిటీ చైర్మన్లుగా సయ్యద్ హుమాయున్, వీరశంకర్‌ను నియమితులయ్యారు. 

-ఆగస్టు 4వ తేదీ నుంచే 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. 

-తాము సోమవారం నుంచే 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చేందుకు అంగీకరించే ప్రొడ్యూసర్లు ఈ మేరకు కన్ఫర్మేషన్ లెటర్‌ను ఫెడరేషన్ ద్వారా కార్మిక యూనియన్లకు తెలియజేయాల్సి ఉంటుంది. 

-కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే కార్మికులు విధులకు వెళ్లాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులెవరూ సినిమాలకు గానీ, వెబ్‌సిరీస్‌లకు గానీ ఫెడరేషన్ అనుమతి లేకుండా హాజరు కావొద్దు. 

-తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇతర భాషా చిత్రాల విషయంలోనూ సభ్యులు ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.