calender_icon.png 22 December, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు

22-12-2025 06:37:51 PM

కాంగ్రెస్ సర్కార్లో విద్యకు ప్రాముఖ్యత..

పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయ రమణ రావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం దాదాపు 45 రోజుల పాటు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఇబ్బందులు పడి సమయం వృధా కాకుండా ఉండటం కోసం తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని సాధించేందుకు తపనతో కృషి చేసి తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయాలన్నారు. ప్రభుత్వ కాలేజీలలో లెక్చరర్లు మంచి విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాలయాలకు దీటుగా గవర్నమెంట్ విద్యాలయాలు పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకుని విషయంలో ప్రైవేటు సంస్థల ఆకర్షణకు గురికాకుండా ఉండాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు తమ చదువులు చదువుతూనే నీట్, ఐఐటి, ఇతరత్రా పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలన్నారు. లెక్చరర్లు ఈ దిశగా దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.