26-10-2025 12:24:46 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయించి, ప్రభుత్వ విద్యాసంస్థలైన మోడల్ స్కూల్స్, గురుకులాల నుంచి ప్రాక్టికల్ సెంటర్లు తొలగించడం అన్యాయమని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంతం నగేష్ తెలిపారు.
ప్రభుత్వ రంగంలో పనిచేసే ఈ పాఠశాలల్లో ల్యాబ్ పరికరాలు, సీసీ కెమెరాలు, సరైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, ఇం తటి సదుపాయాలు ఉన్నా కూడా ప్రైవేట్ కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయించి, ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల ఇంటర్ బోర్డు వివక్ష చూపడం దారుణమన్నారు. ఈ విద్యాసంస్థల్లో చదివే బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఇతర కాలేజీలకు వెళ్లి ప్రాక్టికల్ పరీక్షలు రాయాలంటే భయబ్రాంతులకు గురవడం సహజమన్నారు.
ఈ నిర్ణయం పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే చర్య గా పేర్కొన్నారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకతను పాటించాలనుకుంటే ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా ‘జంబ్లింగ్ సిస్టమ్’ ప్రవేశపెట్టాలని, కానీ ప్రభుత్వ రంగంలోని కాలేజీల్లో ప్రాక్టికల్ సెంటర్లను రద్దు చేయడం సరైన విధానం కాదని ఒక ప్రకటనలో తెలిపారు.