calender_icon.png 13 November, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో అక్రమాలపై విచారణ చేయాలి

30-07-2024 12:51:24 AM

సీపీఐ పక్ష నేత కూనంనేని డిమాండ్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సింగరేణిలో జరిగిన అక్రమాలపై విద్యుత్తు కమిషన్ ద్వారా విచారణ చేపట్టి అవినీతిని బయటపెట్టాలని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్తు శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందని, రూ.70 వేల కోట్ల అప్పులతో ఉద్యోగుల వేతనాలు ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతుందని, ఆదాయం ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.

విద్యుత్తు ప్లాంట్‌లో అనేక మంది కిందిస్థాయి ఉద్యోగుల మరణిస్తే వారికి ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదని, కొత్త నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఒకే అధికారి తొమ్మిదిన్నర ఏళ్లు విధులు నిర్వహించి సంస్థను అప్పులోకి నెట్టారని విమర్శించారు. ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణిని ధ్వంసం కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్తు శాఖకు, సింగరేణికి ఒకే విధానాలు తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడటంతోపాటు సంస్థలు నష్టాల్లోకి వెళ్లకుండా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 

వరంగల్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయం అక్రమ నిర్మాణం: నాయిని రాజేందర్‌రెడ్డి

వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కార్పొరేషన్ అనుమతులు లేకుండా పార్కు స్థలం ఆక్రమించి నిర్మించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. ఒక ఎకరం ప్రభుత్వం స్థలం తీసుకున్నట్టు రికార్డులో చూపించి మరోచోట నిర్మాణం చేశారని విమర్శించారు. విద్యుత్తు బిల్లులో కూడా యాజమాని పేరు బీఆర్‌ఎస్, తండ్రి పేరు కూడా బీఆర్‌ఎస్ ఉండటాన్ని చూస్తూంటే వారు ఎంత అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమ పార్టీ కార్యాలయం కోసం ఆర ఎకరం స్థలం అడిగితే పట్టించుకోలేదని, వారికి మాత్రం ఎకరం తీసుకుని చుట్టుపక్కల మరో ఎకరం కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు చుట్టు ప్రహరీలు నిర్మించే విధంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.