01-01-2026 12:00:00 AM
హుజూర్ నగర్, డిసెంబర్ 31: తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో సాగు,వేలాది గ్రామాలకు తాగునీటిని కృష్ణా నది అందిస్తోంది.అంటే ఏకంగా రెండు రాష్ట్రాల ప్రజలకు జీవనాధారం కృష్ణానది. అలాంటి కృష్ణమ్మ జలాలు రోజురోజుకూ కాలుష్యనీరుగా మారుతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో మురుగునీటిని యథేచ్ఛ గా వదిలేయడం, రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా పారిశ్రామిక వ్యర్థాలు రసాయనాలు కలపడంతో కృష్ణా జలాలను నేరుగా తాగడానికి సందేహ పడాల్సిన పరిస్థితి నెలకొంది.
గత కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో 7 మండలాలు,113 గ్రామాలకు తాగునీరు నిలిచిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.తక్షణమే కృష్ణా నదీ పరిరక్షణ, ప్రక్షాళన, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
నదిలో విషపదార్థాలు, రసాయనాలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ కలిపి వెళుతున్నారు అని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీనిని గమనించిన మట్టపల్లి ప్రజలు,దేవాలయ సిబ్బంది, ఆలయ ధర్మకర్తలకు విషయం చెప్పడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సోషల్ మీడియా వైరల్ కావడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుషిత నీటి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.హుటాహుటిన ఇరిగేషన్ శాఖ కోదాడ డివిజన్ ఎస్‌ఈ నాగభూషన్ కృష్ణ మట్టపల్లిలోని నదిని,నదిలోని నీటిని అధికారులతో పరిశీలించి నీటి శాంపిల్స్ సేకరించారు.అదే విధంగా నదిలో కలుషితమైన రసాయనాలను తొలగించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.
నదిలోని నీటిని ఇతర అవసరాలకు వాడుతున్నామని, ప్రస్తుతం మంచి నీటి కోసం బోరు నీటినే వాడుతున్నామని గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో బోరు నీరు కూడా కలుషితమయ్యేలా ఉన్నదని,తద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టేం దుకు వెళితే నదిలో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానిక జాలర్లు చెప్పారు.
కృష్ణానదిపై ఆధారపడి జీవిస్తున్నాం
కృష్ణానది కలుషితమవుతోన్న సమయంలో &. జలాల పరిరక్షణ, ప్రక్షాళన కోసం తక్షణమే ఇరు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టాలని మట్టపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో సరైన మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఉన్నవి కూడా నిండిపోవడంతో పరిశ్రమల వ్యర్థాలను వైజాగ్ వరకు తీసుకెళ్లి సముద్రంలో కలపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇది ఖర్చుతో కూడుకొని ఉండటంతో పరిశ్రమల అధికారులు మార్గమధ్యలోనే ప్రైవేటు వ్యక్తుల ద్వారా నదీ జలాల్లో కలిపేస్తున్నారని& ఫలితంగా కృష్ణానది కాలుష్య నదిగా మారుతోందని తెలిపారు. దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని పర్యావరణ ప్రేమికులతో పాటు స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా జలాలను కలుషితం చేయడం బాధాకరం
రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు తాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ నీటిని కలుషితం చేయడం అత్యంత విషాదకరం. సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రెండో యాదగిరిగుట్టగా పేరుపొందిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ కలిపి వెళుతున్నారు అని స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్ సార్ కఠిన చర్యలు తీసుకుని కృష్ణమ్మ నీటిని యధావిదంగా ఉండే విధంగా చూడాలని స్వామి వారి భక్తులుగా వేడుకుంటున్నాము.
నల్లగొండ గోపి, నరసింహస్వామివారి భక్తుడు