03-01-2026 12:00:00 AM
పెండింగ్ బిల్లుల సత్వర చెల్లింపులు
అసెంబ్లీలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మానకొండూర్, జనవరి2(విజయక్రాంతి): వచ్చే అక్టోబర్ మాసాంతం వరకల్లా గుండ్లపల్లి-పొత్తూర్ డబుల్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు,భవననాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అడిగిన అనుబంధ ప్రశ్నకు మంత్రి వెంకటరెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
గుండ్లపల్లి-పొత్తూర్ డబుల్ రోడ్ నిర్మాణానికి 71 కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి చెప్పారు కొండాపూర్, జంగాలపల్లి, చాకలివారిపల్లి, చొక్కారావుపల్లి,మాదాపూర్, గన్నేరువరం మీదుగా పొత్తూర్ వరకు 21 కిలోమీటర్ల పొడవున ఉన్న సింగిల్ రోడ్ ను డబుల్ లైన్ రోడ్డుగా మార్చి స్టేట్ హైవేతో అనుసంధిస్తున్నామన్నారు. గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే విధంగా ఈ రహదారి నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు.
ఈ రహదారి రాజీవ్ రహదారి వద్ద ప్రారంభమై 8 గ్రామాల మీదుగా ఒక వైపు కరీంనగర్ జిల్లా కేంద్రానికి, మరో వైపు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి అనుసంధానమై ఉందన్నారు. ఈ పనిని 24 నెలల్లో పూర్తి చేయాలని ఎంఎస్ రియల్ కన్ స్ట్రక్షన్స్ తో ఒప్పందం చేసుకున్నామని, సదరు కాంట్రాక్టర్ ఇప్పటి వరకు 3.5 కిలోమీటర్ల పొడవున పని పూర్తి చేశారని,అలాగే కిలో మీటర్ పొడవున కాంక్రీట్ రహదారి పనులు జరిగాయని, జరిగిన పనుల విలువ రూ 10.50 కోట్ల మేరకు ఉంటుందని, మిగితా పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు. డబుల్ రోడ్ నిర్మాణంలో జాప్యం గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో సమీక్షించి 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయమని ఆదేశించినట్టు చెప్పారు.