14-08-2025 01:45:58 AM
బాలల హక్కుల కమిషన్ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్ పౌరులని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన “తెలంగాణ రైజింగ్- లక్ష్య సాధనలో నేటి బాలలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
బుధవారం సచివాలయంలో బాలల హక్కుల కమిషన్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చర్య లు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన వనరులపై చర్చ జరిగింది.
మంత్రి సీతక్క మాట్లాడుతూ... ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన, సంతోషకర మైన బాల్యం అందించడానికి మిషన్ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల గడువు ఈ నెల 8వ తేదీతో ముగిసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో, గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, న్యాయపరమైన సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.