20-09-2025 12:18:41 AM
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ :
‘బండెనుక బండికట్టి పదహారు బండ్లు కట్టి, ఏ బండ్లే వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా; సుట్టుముట్టూ సూర్యపేట.. నట్టనడుమ నల్లగొండ.. నీ గోరీ కడుతం కొడుకో నైజా ము సర్కోరోడా’ అంటూ హైదరాబాద్ సంస్థానంలోని అన్ని వర్గాల ప్రజలు తమ గొంతుకతో నిజాం సహా రజాకార్లను, దొరలను హడలెత్తించారు. నిజాం పాలించిన హైదరాబాద్ స్టేట్ కేవలం తెలంగాణ ప్రాంతమే (41 శాతం) కాకుండా.. ప్రస్తుత మహారాష్ర్టలో (మరాట్వాడా ) 37 శాతం, ప్రస్తుత కర్ణాటక (కల్యాణ కర్ణాటక)లో 22 శాతంగా ఉండేది.
ఈ మొత్తాన్ని నిజాం.. హైదరాబాద్ స్టేట్‌గా పాలించారు. తెలంగాణాలో నిజాంల అండ చూసుకొని తాబే దారులు, గడీల దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు గ్రామీణ ప్రాంతంలో సామాన్య ప్రజలను అణిచివేస్తూ వారితో వెట్టిచాకిరి చేయించేవారు. గడీలు, జమీందార్లు, జాగీర్దార్ల వికృత పాలనకు వ్యతిరేకంగా పుట్టు కొచ్చిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946లో మొదలైన రైతాంగ సాయుధ పోరాటం చూసుకుంటూ.. నిజాంపై వ్యతిరేకత కంటే ఎక్కువగా భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరిని వ్యతిరే కిస్తూ జరిగిన పోరాటం.
‘మా భూమి’ సినిమా కూడా తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటానికి ఒక అద్దం లాంటిది. కానీ ఈ ఉద్యమానికి సమాంతరంగా భార త జాతీయ వాదులు చేపట్టిన ప్రజా ఉద్య మం చాప కింద నీరులా యావత్తు దేశా న్ని అలుముకునేలా చేసింది. ఇది హైదరాబాద్ నిజాం స్టేట్‌లోకి పాకింది. హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులు 85-.90 శాతం ఉన్నప్పటికీ పరిపాలన మాత్రం ముస్లింల చేతుల్లోనే ఉండేది. పరిపాలనే కాదు ఉన్నత పదవులు 102 ఉంటే.. అం దులో కేవలం ఐదుగురు మాత్రమే హిం దువులు ఉండేవారు.
అదే విధంగా ము స్లింలు, నవాబుల చేతిలో 40 శాతం భూ ములుంటే.. మిగతా భూమి అత్యధికంగా దొరలు, జాగీర్దారుల చేతుల్లో ఉండేది. పుండు మీద కారం చల్లినట్లు 1927లో మొహమ్మద్ నవాజ్ ఖాన్ కీలెధర్ ఆధ్వర్యంలో ముస్లిం ఆధిపత్యం కొరకు ఎంఐ ఎం పార్టీ ఏర్పాటైంది. నిజాంకు రక్షణ కవచంలా ఉండటం, మత మార్పిడిలు, హిం దువుల అణిచివేత ఈ పార్టీ ప్రధాన లక్ష్యం. వీరి ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల విధ్వంసం జోరుగా నడిచింది. వారికి నిజాం అండదండలు ఉండేవి.
ఆర్య సమాజ్ ఉద్యమం
భారత స్వాతంత్య్ర ఉద్యమం తుదిదశకు వచ్చిన తర్వాత, లాతూర్ లో వకీలు గా పనిచేస్తున్న ఖాసీం రిజ్వి ఎంఐఎం పగ్గా లు చేబట్టి, నిజాంకు రక్షణగా రజాకార్లు అనే పారా మిలిటరీ దళాన్ని ఏర్పాటు చే యడం జరిగింది. ఇక దేశంలోని దాదాపు 602 సంస్థానాలు భారత దేశంలో విలీనం కాగా, అందులో అత్యంత పెద్దదైన, సంపన్నమైన హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర దే శంగా లేదా పాకిస్తాన్‌తో కలవాలని ని జాం కోరుకోగా.. వారికి అంతర్గతంగా జాగీర్దార్లు అండగా నిలిచారు.
అప్పటికే హిందూ రక్షణ కొరకు అనేక జాతీయ వా దులు, భారతీయ సాంస్కృతిక పునర్జీవం కోసం పోరాటం చేస్తూ వచ్చాయి. ఉదాహరణకు ఆర్య సమాజ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), ఇతర హిం దూ సంస్థల వ్యక్తులు హైదరాబాద్‌లో ని జాం పాలనను వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగించాయి. 1892లో స్వామి నిత్యానంద, స్వామి గిరిజానంద సరస్వతి ఆధ్వర్యంలో కోఠిలో ఆర్యసమాజ్ స్థాపన జరిగింది.
సనాతన ధర్మ పరిరక్షణ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా శుద్ధి కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్వ హిస్తూ హిందూ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించారు. వేదాంత మహారాజ్, న రేంద్ర ఆచార్య ఆర్య సమాజ్ తరఫున ని జాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడు తూ తమ ప్రాణాలు పణంగా పెట్టారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో హిందూ సమావేశాల నిర్భందంతో నిజాం పాలన కు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహం మొదలుపెట్టారు.
శుద్ధి కార్యక్రమాల ద్వారా మతం మారిన వారిని తిరిగి హిం దూ మతంలోకి మార్చిన స్వామి శ్రద్ధానంద ను ఖాజా హాసన్ చంపేశారు. అలా నే 1938 లో స్వామి రామానంద తీర్థ నిజాం వ్యతిరేక సత్యాగ్రహం చేపట్టారు. దసరా సందర్భంగా అరెస్ట్ అయినా శామ్ లాల్ బీదర్ జైలులో అనుమానాస్పద స్థితి లో చనిపోవడం అనుమానాలకు దారి తీసింది. హిందూవాది అయిన వేదప్రకాష్‌ను గుంజోటిలో దారుణ హత్యకు గుర య్యారు. ఇలా తమ పాలనకు వ్యతిరేకం గా పోరాడిన వ్యక్తులు, సంస్థల సభ్యులను హతమార్చడం లేదా జైళ్లలో నిర్భందించడం చేస్తూ నిజాంలు తమ క్రూరత్వాన్ని చూపించారు.
ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర
1938 జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో ఆర్య సమాజ్ అభ్యర్థన మేరకు ఆర్‌ఎస్‌ఎస్ 2వేల మంది యువ వలంటీర్లను ని జాం, రజాకార్ల వ్యతిరేక ఉద్యమానికి సమకూర్చింది. మరాట్వాడా, విదర్భ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నా రు. అలాగే హిందూ సభ నేత వీర్ సావర్కర్, బాగ్ నగర్ ఉద్యమం, సహాయ నిరా కరణ ఉద్యమం ఇలా అనేక రకాలుగా చేస్తున్న పోరాటాలకు ఆర్‌ఎస్‌ఎస్ తన వంతు సహకారం అందించింది.
ఆర్‌ఎస్‌ఎస్ సంచాలకుల్లో చాలా మంది పోరా టం చేస్తున్న హిందూ సంస్థలకు రహస్య మార్గంలో దేశీయ తుపాకులను అందించింది. 1947-48 మధ్యలో ఆర్య సమా జ్, ఆర్‌ఎస్‌ఎస్, ఇతర హిందుత్వ వాదులు షోలాపూర్, ఉస్మానాబాద్, ఫంధర్మాపూర్‌లలో గెరిల్లా యుద్ధం చేసి 85 గ్రామాలకు విముక్తి కలిగించారు.
అంతేకాదు జాతి విముక్తి కోసం పోరాటం చేస్తున్న అనేక మంది కాంగ్రెస్ నాయకులకు, హిందూ మహాసభ నాయకులకు ఆశ్రయంకల్పించారు. అదే సమయంలో స్వామి సచ్చిదా నంద, పండిట్ కేశవరావు, పండిట్ దత్తాత్రేయ, రామచంద్ర వీరప్ప లాంటి నాయ కులు అనేక విద్యాలయాలు, హనుమాన్ వ్యాయామశాలలు నిర్మించారు. ఇవన్నీ నిజాం వ్యతిరేక ఉద్యమాలకు కేంద్ర బిందువులుగా పనిచేయడం విశేషం.
హిందూ సంస్థల పోరాటం
హైదరాబాద్ సంస్థానంలో నిజాం సహా రజాకార్లు, గడీల దొరలు, దేశ్‌ముఖ్‌లు దోపిడీలు, వెట్టి చాకిరీ లాంటి ఆకృ త్యాలకు తెగబడుతూ తెలంగాణ ప్రజలను పట్టి పీడించారు. ఈ సమయంలోనే వినాయక్ దామోదర్ సావర్కర్ నాయకత్వం లో హిందూ మహాసభలు ఏర్పాటు చేసి పరోక్షంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి తమ వంతు సహకారం అందించారు. వీడీ సావర్కర్ నేతృ త్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్య మం సహా హిందూ మహా సభలో ఆయన ప్రసంగాలు యువతను ప్రేరేపితం చేశా యి.
అయితే హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమాలు రెండు కోణాల్లో జరిగాయి. మొదటిది కమ్యూనిస్టులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం కాగా.. రెండోది హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో విలీ నం చేయాలంటూ హిందూ సంస్థలు చేసి న పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే.. ఆర్య సమాజ్, హిందూ మహా సభ, రాష్ట్రీయ స్వయం సేవక్, మేధావులు నిజాం పాలన నుంచి విముక్తి పొందేందుకు తమ ఆఖరిక్షణం వరకు పోరాడారు.
చివరకు 1948, సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం నిరంకుశత్వ పాలనకు ము గింపు పడింది. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో ఐదు రోజుల పాటు అప్పటి మిలిటరీ జనరల్ జేఎన్ చౌదరీ నేతృత్వంలో జరిగిన ఆపరేషన్‌కు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద సమాధానం లేకపోవడంతో చివరకు తలవంచాల్సి వచ్చింది.
అయినప్పటికీ రెండు శతాబ్ధాలు హైదరాబాద్ సంస్థానాన్ని తన కనుసన్నల్లో పెట్టుకున్న నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా ప్రకటించడం కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. అయితే నిజాంల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం హిందూ సంస్థలైన ఆర్య సమాజ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇతర హిందూ సంస్థల పోరాటాన్ని మరువకూడదు.
వ్యాసకర్త: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు