05-08-2025 12:09:27 AM
మహబూబాబాద్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): కొద్దిపాటి వర్షం వచ్చినా ఆ పాఠశాలకు విరామం ప్రకటించాల్సిందే. వరద నీరంతా పాఠశాలలో చేరి చెరువుగా మారడంతో వర్షాకాలంలో విద్యార్థుల చదువుకు తరచుగా ఆటంకం కలుగుతోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వర్షాకాలం వచ్చిందంటే చాలు బడి చెరువుగా మారుతోంది.
పాఠశాలలో ఐదు తరగతులు నిర్వహిస్తుండగా, ఎర్రగడ్డ అంగన్వాడీ కేంద్రం కూడా ఇందులోనే నిర్వహిస్తున్నారు. ఐదు తరగతుల్లో 79 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా, అంగన్వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలు ఆటపాటలతో చదువు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 5 గదులు ఉండగా, ప్రాథమిక పాఠశాల నిర్వహణకు మూడు గదులు, అంగన్వాడి కేంద్రం నిర్వాణకు ఒక గది, ఆఫీస్ నిర్వాణ కోసం ఒక గది వినియోగిస్తున్నారు.
ప్రధాన రహదారికి మూడు అడుగుల దిగువన పాఠశాల ఉండడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నేరుగా పాఠశాల ఆవరణలోకి చేరుతోంది. వర్షం నీరు తరగతి గదుల్లోకి ప్రవేశించి అక్కడే తిష్ట వేస్తుండడంతో చదువుకు ఆటంకంగా మారుతుంది. వాతావరణం అనుకూలించి, వర్షం నీరు ఇంకేంతవరకు పాఠశాల నిర్వాణకు తాత్కాలిక విరామం ప్రకటించాల్సిన పరిస్థితి వర్షాకాలంలో తరచుగా ఏర్పడుతుంది.
ఎం ఆర్ సీ నిర్వహణకు ఆటంకం
ఇదే పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి కార్యాలయం, మండల విద్యా వనరుల కేంద్రం (ఎం ఆర్ సీ) ఉంది. వర్షాకాలంలో వరద నీరు ఎంఈఓ, విద్యా వనరుల కేంద్రంలోకి ప్రవేశిస్తుంది. గత ఏడాది భారీ వర్షాలకు సుమారు ఐదు అడుగుల నీరు చేరడంతో కార్యాలయంలో కంప్యూటర్లు, ఇతర వస్తువులు, పాఠ్యపుస్తకాలు, రికార్డులు తడిసి పనికిరాకుండా పోయాయి. అటు పాఠశాల ఇటు మండల విద్యా వనరుల కేంద్రం , ఎంఈఓ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం నిర్వాహనకు వర్షాల వల్ల వచ్చే వరదలు ఆటంకంగా మారుతున్నాయి. దీనికి తోడు ఎమ్మార్సీ భవనం పైకప్పు పూర్తిగా శిథిలంగా మారి పెచ్చులూడి పడుతుంది.
కూలిన ప్రహరీ గోడ
గత వర్షాకాలంలో పాఠశాల ప్రహరీ కూ డా పడిపోయింది. కూలిన ప్రహరీ గోడను పునర్నిర్మించలేదు. దీనితో పాఠశాలలోకి పశువులు, పాములు, తేళ్ళు వస్తున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. ఇటు వర్షం నీరు, అటు పురుగు పూసి వస్తుండడంతో విద్యార్థుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పాత భవనాలను తొలగించాలని వాటి స్థానంలో పాఠశాల, ఎంఆర్సీ, ఎంఈఓ, అంగన్వాడి కేంద్రాలను ఎత్తు పెంచి కొత్తగా భవనాలను నిర్మించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.