calender_icon.png 23 May, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటల ఝరి వేటూరి

22-05-2025 01:18:43 AM

తెలుగు పాటల ప్రపంచంలో వేటూరి సుం దర రామమూర్తిది ప్రత్యేకమైన శైలి. పాటకు కావ్యగౌరవం తీసుకొచ్చారనేది ఆయనకున్న ఘన కీర్తి.  1936 జనవరి 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో వేటూరి జన్మించారు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. వేటూరిపై తన పెద్దనాన్న వేటూరి ప్రభాకరశాస్త్రి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనా రాయణ ప్రభావం ఎంతో ఉంది.

తొలిరోజుల్లో వేటూరి జర్నలిస్టుగా పనిచేశారు. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్‌తో పరిచయమైంది. ‘ఓ సీతకథ’ సినిమా ద్వారా వేటూరి గేయ రచయిత అవతారమెత్తారు. ముఖ్యంగా ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) నటించిన ‘అడవి రాముడు’ చిత్రంలో వేటూరి రాసిన ‘ఆరేసుకోబోయి..

పారేసుకున్నాను హరి’ అనే పాట నాడు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మాస్ పాటలకు కేరాఫ్‌గా వేటూరి నిలుస్తూనే, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ వంటి క్లాసిక్ చిత్రాలకూ పాటలు రాసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన పాటల ప్రయాణంలో వేటూరి ఆరు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

1994లో విడుదలైన ‘మాతృదేవోభవ’ అనే చిత్రానికి ఆయన రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ అనే పాట జాతీయ అవార్డుకు ఎంపికైంది. ‘సుందరాకాండ’లో ‘ఆకాశానికి సూర్యుడుండడు తెల్లవారితే’, ‘కర్తవ్యం’ చిత్రంలోని ‘ధుర్యోధన.. దుశ్శాసన దుర్వినీత లోకంలో’, ‘సాగర సంగమం’లోని ‘మౌనమేలనోయి’, ‘శంకరభరణం’లోని ‘శంకరా నాద శరీరాపర’, ‘గీతాంజలి’లోని ‘ఆమని పాడవే హాయిగా’..

అనే పాటలు ఆయన ప్రతిభకు మచ్చుతునకలు. తన చరమాంకంలో ‘విలన్’, ‘లీడర్’, ‘సూర్య.. సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలను శ్రోతలు ఎంతగానో ఆదరించారు. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడు కూడా వేటూరిని ఎంతో ఇష్టపడేవారు. ఆయన తీసిన ‘ఇద్దరు’ చిత్రానికి మాటల రచయిత వేరొకరైనప్పటికీ.. ఆ చిత్రంలో ఓ పాత్ర ఉచ్ఛరించే కరుణానిధి కవితలను వేటూరితోనే రాయించి మురిసిపోయారు.

న్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమద్విరాట పర్వము’ సినిమాలో బృహన్నల, ఉత్తరకు నాట్యం నేర్పే సందర్భంలో వేటూరి కలం నుంచి జాలువారిన “ఆడవే హంస గమనా..” అని రాసిన పాటను నాడు వేనోళ్లు కీర్తించాయి.

తన పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి వద్ద నేర్చిన పదవిన్యాసాలను “వాగర్థావివ సంపృక్తౌ” శ్లోకంలోనూ “వందే పార్వతీపరమేశ్వరౌ’ అంటూ పార్వతీపరమేశ్వరులకు వందనం చేసేలా చేశారు.వేటూరి మొత్తం 10,000కి పైచిలుకు పాటలు రాశారు. 2010 మే 22న ఆయన తన 74వ వయస్సులో కన్నుమూశారు. వేటూరి ఇప్పుడు మన మధ్య లేకున్నా.. ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ తొలుగు లోగిళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

  మిద్దె సురేష్, వ్యాసకర్త సెల్‌నంబర్  97012 09355