23-05-2025 01:14:51 AM
ఎవరికి పుట్టిన బిడ్డ.. ఎక్కెక్కి ఏడుస్తోంది!
అనాథలా..
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : కాళేశ్వరం బహుళార్ధసాధక సాగునీటి ప్రాజె క్టు.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు వల్ల ఏదైనా ప్రయోజనం కలుగుతుందా అనేది డోలాయమానమే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హడావుడిగా, హంగూ ఆర్భాటాల మధ్య ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తి పోతల పథకం స్వల్ప కాలంలోనే వట్టిపోయి నీరుగారిపోయే పరిస్థితి దాపురించింది.
రూ. 1.47 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు నడిసంద్రంలో నావ లా తయారయ్యింది. ఇటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచన లేకుండా, కేంద్రంలోని బీజేపీపై నెట్టివేసేందుకు ప్రయత్నిస్తుండగా.. వట్టిపోయిన ప్రాజెక్టును ఏం చేద్దామనే ఆలోచన చేయాల్సింది మీరే కదా, అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేలెత్తిచూపుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నది.
ఇదం తా రాజకీయ డ్రామా అంటూ గత ప్రభుత్వాన్ని ఏలిన బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు త్రిశంకు స్వర్గంల మారింది. ఎవరూ బాధ్యత తీసుకోని అనాథలా తయారయ్యింది..!
బాకాలూదిన బీఆర్‌ఎస్..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.. ప్రపంచంలోనే అతి పెద్దదంటూ బాకాలు ఊదిన బీఆర్‌ఎస్ అధినేత, అప్పటి సీఎం కల్వకుంట్ల చం ద్రశేఖర్‌రావు కనుసన్నల్లోనే రూ. 1.47 లక్షల కోట్లతో, 19.63 లక్షల ఎకరాలకు సాగునీరు, మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్టెబిలైజేషన్‌తోపాటు లక్షలాది మందికి తాగునీరు, భూగర్భజలాల పెంచుతాయనే లక్ష్యంతో పూర్తిచేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, కెనాళ్లు, పంపింగ్ స్టేషన్లతో తెలంగాణలో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమూలంగా మార్పు ల సంభవిస్తాయని బీరాలు పలికింది. తన మేధో సంపత్తిని అంతా రంగరించి డిజైన్ చేసిన కాళేశ్వరం ఒక అద్భుతమైన మానవ నిర్మితమంటూ అప్పటి సీఎం పేర్కొన్నారు.
అతి తక్కువ రికార్డు సమయంలో పూర్తి చేశామంటూ ఆర్భాటపు ప్రచారంపై దృష్టి సారిం చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును సరైన సాంకేతిక పద్ధతుల్లో నిర్వహించకపోవడం, నిర్మాణంలో, నిర్మాణ పనుల్లో లోపాల కారణంగా ఒక సంవత్సరంలోనే 2023 ఎన్నిక లకు ముందు కుంగిపోయింది.
కుంగిన తరువాత మౌనంగా..
శాసనసభ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు వచ్చి నదిలోపలికి కుంగిపోవడంతో అప్పటినుంచి బీఆర్‌ఎస్ నేతల నోళ్ళకు తాళం పడింది. కేవలం రాజకీయ ప్రత్యారోపణలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటూ.. వీలైనంత వరకు తమ కేమీ సంబంధం లేదన్నట్టుగా బీఆర్‌ఎస్ నేత లు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
అంతా నేనే అంటు ప్రగల్భాలు పలికిన అప్పటి సీఎం కేసీఆర్‌గానీ.. ఆయనకు అండ గా ఉంటూ వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావులు గానీ కాళేశ్వరం కుంగుబాటుకు కారణాలపై మాట్లాడకుండా, ఏదో ఒక ఇటుక పగిలింది.. ఒక స్థంభం కుంగిందంటూ.. బాధ్యత తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తుండటం ఇక్కడ గమనార్హం.
2023 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షం పాత్రకు పరిమితమైన తరువాత కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ ఒక్కమాటా మాట్లాడ టం లేదు. మొదటి నుంచి కాళేశ్వరం నిర్మాణాన్ని పరిశీలించిన హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఆసలు లోటుపాట్లను వెల్లడించకుండా రాజకీయంగా ప్రత్యర్థులపై బురద జల్లేందుకే వినియోగించుకుంటున్నారు. దీనికితోడు.. ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఒక్క నిజం మాట్లాడటం లేదు.
వాస్తవాలను ప్రజలకు వివరించడం లేదు. వెరసి అంతా బాగానే నిర్మించాం.. అనుకోని విధంగా ఒక చిన్న సంఘటన జరిగితే.. దానిని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మొ త్తం కాళేశ్వరాన్నే పక్కనపెట్టే విధంగా వ్యవహరిస్తూ.. ప్రజలు, రైతులకు మేలు జరగకూ డదనే విధంగా కక్షపూరితంగా ముందుకు సాగుతుందనే ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
తప్పితే.. బాధ్య తను తీసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అయితే అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు మాత్రం ఒక్క విషయం లో.. ప్రాజెక్టు మొత్తం అప్పటి ప్రభుత్వ పెద్ద లు చెప్పినట్టుగానే నిర్మించామనే విషయం లో స్పష్టత ఇస్తున్నారు.
మన్నుతిన్నపాములా బీజేపీ..
కాళేశ్వరం ప్రాజెక్టును మొదట్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు మెచ్చుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జల వనరుల శాఖా మంత్రి, సీడబ్ల్యూసీ ఉన్నతా ధికారులు, గవర్నర్లు ఇలా.. అందరూ ఆహో.. ఓహో అంటూ మెచ్చుకున్నవారే. ఆ తరువాత బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నేతలమధ్య స్నేహం చెడటంతో.. కాళేశ్వరంపై అవి నీతి ఆరోపణల రాగం ఎత్తుకున్నారు.
ప్రధా ని, హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు.. ఒకరేమిటి రాష్ట్రానికి వచ్చిన ప్రతి బీజేపీ నేతకూ డా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏటీఎం లా మారిందని, రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇదే బీజేపీ ప్రభుత్వంలోని సీడబ్ల్యూసీ కాళేశ్వరానికి అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు, రుణాలు మంజూరయ్యేలా చూసింది. ఇంతా చేసిన బీజేపీ పెద్దలు కాళేశ్వరం రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. ప్రస్తు త కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటివా రు మేము ప్రభుత్వంలోకి వస్తే.. అవినీతి మొత్తాన్ని కక్కిస్తాం అంటూ చెబుతున్నారు.
కానీ కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించొచ్చు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థల సేవల ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నా.. కేవలం కాళేశ్వరాన్ని రాజకీయంగా విమర్శలకు అస్త్రంగా మాత్రమే ఉపయోగిం చుకుం టోంది బీజేపీ.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం మారి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు కొంత అనుమానాస్పదంగా, విస్మయం గా కనపడుతోందనే చెప్పవచ్చు. రూ. 1.47 లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూలన పడటానికి కారణ మైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, చేపట్టాల్సిన చర్యలపై స్పందన శూ న్యంగానే చెప్పవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి ప్రజా ప్రయోజనం కల్గించేలా ఏం చే యాలి.. ఎలా చేయాలనేదానిపై రాష్ట్ర ప్రభు త్వం నివేదిక ఇస్తే.. తాము పరిశీలించి చెబుతామంటూ నర్మగర్భంగా దాటవేస్తోంది బీజేపీ ప్రభుత్వం.
కాంగ్రెస్ చేతిలో రాజకీయ ‘అస్త్రం’లా..
ఇక మొదటి నుంచి కాళేశ్వరంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఒకటిన్నర సంవత్సరాలు పూర్తవుతున్నా.. ప్రజా ప్రయోజనం దిశగా ఒక్క అడుగుకూడా వేయడానికి సంసిద్ధంగా లేదన్నట్టే కనపడుతోంది. రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ సైతం విమర్శించారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాల కాలం గడుస్తున్నా.. కాళేశ్వరం అవినీతి అంశాన్ని అలాగే నాన్చుతూ వస్తున్నారు.
విచారణలు, దర్యాప్తులను ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. విజిలెన్స్ విచారణ కీలక దశలో ఉన్నప్పుడు కమిషన్ వేశారు. ఒకే అంశంపై రెండు విచారణలు ఉండకూడదనే నియమంతో.. విజి లెన్స్ విచారణలో స్థబ్దత నెలకొంది. ఎట్టకేలకు విజిలెన్స్ విచారణ నివేదిక ప్రభుత్వా నికి, అటు కాళేశ్వరం విచారణ కమిషన్‌కు చేరినా ఇంకా మీనమేషాలు లెక్కిండం తప్ప డం లేదనే విమర్శలు వినపడుతున్నాయి.
అనాథలా..
మూడు పార్టీల మధ్య రణరంగంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మూలకు పడటంతో.. అసలు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. ప్రజా ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును అన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేశాం.. ఎక్కడా మేము సంతకాలు చేయలేదనే బీఆర్‌ఎస్ అంతర్గత వాదనలు చూస్తే.. తమ బాధ్యత ఏమీ లేదనే చెప్పి తప్పించుకోజూస్తోంది.
ఇక ఇంజనీర్లు, అధికారులు తామేం తప్పు చేయలేదు.. అప్పటి ప్రభుత్వం, ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్టుగా చేశాం..అంటూ తమ బాధ్యతలనుకూడా వదిలించుకుంటున్నారు. తప్పిదం అప్పటి ప్రభుత్వానిదే.. విచారణలో తేలినట్టుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటా.. ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం ఎలా చెబితే అలా చేస్తామంటూ ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘాలు తీస్తోంది.
మీరు ఒక ప్రణాళికతో రండి... ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని.. తమకే సంబంధం లేదన్నట్టుగా కేంద్రంలోని ప్రభుత్వం స్తబ్ధుగా ఉంటోంది. ఇలా ఎవరికి వారు.. బాధ్యతలను దులిపేసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే.. అసలు కాళేశ్వరానికి బాధ్యులెవరు? బాధ్యతలు ఎవరు తీసుకుంటారు?.. అనేది తెలియక భవిష్యత్తు అంధకారంలో చిక్కుకుంది.
రూ. 1.47 లక్షల కోట్ల ప్రజాధనం గోదావరిలో మునిగిపోవాల్సిందేనా.. మూలన పడాల్సిందేనా... అనాథగా మిగలాల్సిందేనా అనేది కాలమే నిర్ణయించాలి.
మరమ్మత్తులపై దృష్టి ఏది?
ఏదైనా ప్రాజెక్టుల్లో లోపం తలెత్తితే.. దానిని పూర్తిగా వదిలేయకుండా.. ఆ లోపాన్ని సరిచేసి.. మళ్ళీ ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఆ దిశగా ఉన్నట్టుగా కనపడటం లేదు. రాజకీయ అస్త్రంలా దానిని ఉపయోగించుకుని, గత ప్రభుత్వం, అప్పటి పెద్దలను దనుమాడటం తప్పితే.. రూ. 1.47 లక్షల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజా ప్రయోజనం ఎలా పొందాలనే ప్రణాళిక ఉన్నట్టుగా కనపడటం లేదు.
మరమ్మత్తులు చేపడితే రూ. 12 వేల కోట్ల వరకు అవుతాయని, తద్వారా రాష్ట్రానికి ప్రయోజనం కల్గించేలా కాళేశ్వరాన్ని తీర్చిదిద్దవ చ్చనే నిపుణుల అభిప్రాయాన్ని ప్రభు త్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైపెచ్చు.. కేంద్రం ఏం సూచిస్తే.. అలా చేస్తామంటూ మరింత కాలయాపనకు తెలంగాణ ప్రభుత్వం దిగుతోంది.
రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన రూ. 1.47 లక్షల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలకే ప్రతియేటా రూ. 16 వేల కోట్లను చెల్లిస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం.. ఏం చేస్తే దానిని మనుగడలోకి తీసుకువచ్చే అవకాశం ఉందనే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనపడటం లేదు.
అటు కేంద్రం నుంచి స్పష్టమైన సూచనలు రావడం లేదు. మీరు ప్రణాళిక చెప్పిండి.. మేము పరిశీలిస్తామని కేంద్రం నిష్టూరానికి వెళితే.. మీరు ఎలా చెబితే.. అలా చేస్తామంటూ రాష్ట్రం సమాధానమిస్తోంది. దీనితో కాళేశ్వరం కాస్తా మెల్లిమె ల్లిగా శిథిలావస్థలోకి వెళుతోంది.
కొసమెరుపు..
ఇంతటి విఫల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1.47 లక్షల కోట్లతో.. అప్పటి ప్రభుత్వ సూచనల మేరకు నిర్మించిన కాంట్రాక్టర్లు, ఏజన్సీల తరహా మరో విధంగా ఉంది. కాళేశ్వరం నిర్మాణంలో ఏజన్సీలు, కాంట్రాక్టర్ల తప్పులు ఉన్నప్పటికీ.. వారిపై చర్యలు తీసుకోకుండా, బ్లాక్ లిస్ట్‌లో పెట్టకుండా.. ఇటు తెలంగాణలోనూ కొని ప్రాజెక్టులను.. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అజమాయిషీలోని మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా అదే ఏజన్సీలు, కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం కొసమెరుపు.
ఎండుతున్న రాష్ట్రం..
రూ. 1.47 లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో రాష్ట్ర ప్రజలకు భారీగానే లాభం కలగాలి. లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు, వేలాది పరిశ్రమలకు నీటిని అందిస్తూ.. భూగర్భజలాలను వృద్ధి చేసేలా ఉండాలి. కానీ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా కాళేశ్వరాన్ని మలుచుకుని మూడు పార్టీలు విమర్శనాస్త్రాలకే పరిమితమవుతున్నాయి.
కాళేశ్వరం వల్ల ప్రయోజనాన్ని సాధించడం ఎలా అనే కోణంలో ఎవరూ ఆలోచించినట్టుగా కనపడటం లేదు. చెరువులు, రిజర్వాయర్లు నింపడం లేదు. నీటిని ఎత్తిపోయడం లేదు. బ్యారేజీలను బాగు చేసింది లేదు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు.
గతంలోలా తెలంగాణ ప్రజలు, రైతులు తిరిగి రుతు పవనాలనే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనుచూపు మేరలో కనపడుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు.. చేసిన ఖర్చు అన్నింటినీ మర్చిపోదామని అనుకున్నా.. తిరిగి చెల్లించాల్సిన రుణాలు, వడ్డీలు మాత్రం ఎప్పుడూ పక్కలో బల్లెంలా గుచ్చుతూనే ఉన్నాయి.