07-01-2026 12:33:09 AM
తెరపైకి ఇలవేల్పుల చరిత
పీవో రాహుల్ అద్భుత సృష్టి
పుస్తక రూపంలో అందుబాటులోకి
భావితరాలకు సజీవ సంస్కృతి
భద్రాచలం, జనవరి 6 (విజయక్రాంతి): పక్షుల కిలకిల రావాలు..! జింక పిల్లల గంతులు...! పచ్చని అడవులు...! ఆదివాసీల జీవనం...! మాఘ పున్నమి పండు వెన్నెల్లో ఇలవేల్పుల జాతరలు...! ప్రకృతి సమతుల్యత...! సాంప్రదాయ సజీవం...! ఇది ఆదివాసీ సమాజం...! అందమైన వారి నినాదం...!
ఆదివాసీ తెగల జీవన విధానం, సజీవ సాక్షాలను ఇప్పటికే ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచిన భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ మరో అడుగు ముందుకేశారు. ఆదివాసి ఇలవేల్పుల చరితను వెలుగులోకి తెచ్చి భావి ఆదివాసీ సమాజానికి అందించేందుకు పూనుకున్నారు. తలపతులు, ఆర్తి బిడ్డల బృందం కొండ కోనల్లో సేకరించిన సమాచారం పుస్తక రూపం దాల్చుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తెరపైకి ఆదివాసీల ఇలవేల్పుల చరిత్ర
భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ గిరిజన పాలన సర్వత్ర ప్రశంసలు అందు కుంటోన్న విషయం విధితమే. ప్రతి అంశం వారికి ప్రత్యేకమే. గిరిజన అభ్యున్నతికి, వారి భాష, సంస్కృతికి పెద్దపీట వేస్తూ వచ్చిన పిఓ రాహుల్ అద్భుత ఆలోచన ట్రైబల్ మ్యూజియం ఆధునికీకరణ. అంతటితోనే పిఓ రాహుల్ ఆగిపోలేదు. మరో నూతన సృష్టికి తెర లేపారు. అదే ఆదివాసి ఇలవేల్పుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడం. తలపతులు, ఆర్తి బిడ్డలను బృందంగా ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ గోదావరి తీర ప్రాంతాల్లో సుమారు 142 ఇలవేల్పులు వెలిసిన ప్రదేశాలను సందర్శించి ఆదివాసి పెద్దమనుషులను, పూజరులను కలిసి 7గట్టు గోత్రాలు, 750 ఇంటిపేర్లతో ఉన్న ఇలవేల్పుల చరిత్రను సేకరింపజేశారు.
పిఓ కూడా స్వయంగా ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. సేకరించిన ఈ సమాచారాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఐటీడీఏ పీవో రాహుల్ స్వయంగా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. రాబోయే తరానికి ఈ ఆదివాసి చరిత్ర ఎంతగానో ఉపకరించనుంది.
అద్భుత సాంస్కృతిక సంకలనం
ఆదివాసి కోయ ఇలవేల్పుల చరిత్ర ఒక అద్భుతమైన సాంస్కృతిక సంకలనం అని చెప్పవచ్చు. అడవులు, కొండలు, నదులతో అనుబంధంగా జీవించే కోయ సమాజం తమ జీవన విధానంలో దేవతలను కేవలం ఆరాధన మూర్తులుగా మాత్రమే కాకుండా, తమ రక్షకులుగా, మార్గదర్శకులుగా, సామూహిక చైతన్యానికి ప్రతీకలుగా భావిస్తుంది. తరతరాలుగా నోటి మాటల ద్వారా,ఆచారాలు- సాంప్రదాయాల ద్వారా నిలిచిన ఈ కులదేవతల విశ్వాసాలు కోయ తెగ యొక్క చరిత్ర, సామాజిక వ్యవస్థ,నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి.
22 అంశాల ఆధారంగా సేకరించబడిన సవివివరణాత్మక సమాచారం, సమగ్రంగా విశదీకరించడం ఈ గ్రంథానికి ప్రామాణికతను సంతరించి పెట్టింది. కోయ తెగలో వివిధ కులదేవతల ఆవిర్భావ కథలు, పూజా విధానాలు,పండుగలు, ఇలవేల్పుల పండుగలు జరుపుకునే సమయము,వాటి వెనుక ఉన్న లోతైన అర్ధాలను సమగ్రంగా పరిచయం చేసిన విశ్వసనీయమైన ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఆధునికత ప్రభావంతో వేగంగా మారుతున్న జీవనశైలిలో కనుమరుగవుతున్న ఈ ఆచారాలను లిఖిత రూపంలో భద్రపరచటం గమనార్హం.
ఈ గ్రంథం ద్వారా కోయ తెగ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గౌరవిస్తూ భవిష్యత్తు తరాలకు ఒక అమూల్యమైన సంపద అందజేయడం చోటు చేసుకుంది. కోయ కులదేవతల అధ్యయనం ద్వారా మనకు ప్రకృతి - మానవ సంబంధం,సామాజిక జీవనస్పూర్తి, భక్తి యొక్క సరళమైన శక్తివంతమైన రూపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఈ పుస్తకం పరిశోధకులకు, విద్యార్థులకు అలాగే సాంస్కృతిక సంపదపై ఆసక్తి కలిగిన ప్రతి పాటకునికి ఒక విశ్వసనీయ మార్గదర్శిగా నిలుస్తుందనటంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఈ అరుదైన సమగ్ర సంకలనం రూపకల్పనకు మార్గదర్శకులు భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ను మరి అభినందిద్దామా...!