calender_icon.png 11 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాల్లో ‘కోలాహలం’

07-01-2026 12:16:39 AM

  1. పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 

రిజర్వేషన్లపై ఉత్కంఠ మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు 

మేడ్చల్, జనవరి 6 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలలో ఎన్నికల కొలాహలం మొదలైంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో కేవలం మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఇటీవల ఏర్పడ్డాయి.

గతంలో జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ లు, 9 మున్సిపాలిటీలో ఉండేవి. ఇవి రింగురోడ్డు లోపల, రింగ్ రోడ్డు ని ఆనుకొని ఉండడంతో ప్రభుత్వం ఇటీవల జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. అంతకుముందు జిల్లాలోని గ్రామపంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేసింది. రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామాలను కలిపి ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఏర్పాటు చేసింది. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నందున ఇవి కూడా జిహెచ్‌ఎంసి లో కలుస్తాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు  చేస్తుండడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 

మున్సిపల్ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడు మున్సిపాలిటీలలో ఓటరు జాబితా ముసాయిదాలు వెల్లడించారు. ఓటరు జాబితా పై ఈ నెల 5 వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి అదే రోజు రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈనెల 10వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నారు. 

పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు 

మున్సిపల్ ఎన్నికలలో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతాయి. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ అవసరం. దీంతో ఆయా పార్టీల నియోజకవర్గ బాధ్యులను కలిసి తమ అంతరంగాన్ని వెల్లడిస్తున్నారు. ఈ మూడు మున్సిపాలిటీలు మేడ్చల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఎల్లంపేట, మూడు చింతలపల్లి లలో 24 వార్డులు చొప్పున, అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి.

పోటీ చేయాలనుకునేవారు గ్రౌండ్ వరకు కూడా చేసుకుంటున్నారు. పార్టీల నాయకులు సైతం కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం డిసిసి అధ్యక్షుడు వజ్రష్ యాదవ్, సీనియర్ నాయకులు హరి వర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ నిర్వహించారు. వీరు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఐదు రోజుల క్రితం ఎంపీ ఈటెల రాజేందర్ బిజెపి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఐక్యంగా ఉండి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. 

రిజర్వేషన్లపై ఉత్కంఠ 

మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ మూడు కొత్త మున్సిపాలిటీలలో చైర్మన్ పదవి, వార్డ్ మెంబర్ పదవులు ఏ కేటాగిరికి రిజర్వేషన్ అవుతుందనే విషయంలో ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ సస్పెన్స్ ఉన్నప్పటికీ ఆశావహులు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావిస్తున్నారు.