13-07-2025 12:00:00 AM
కళను తన అణువణువులో నింపుకొన్న అరుదైన కళాజీవి గురుదత్. యవ్వన దశలోనే తనను సినీ రంగం ఆకర్షించడంతో తన ప్రయాణం అటు వైపు సాగింది. తన అంతర్మథనాన్ని, భావావేశాన్ని తెరకెక్కించాలనే ఆలోచనా జ్వాల తనను ఎల్లప్పుడూ ముందుకు నడిపించేది. ఆ ఆలోచనలకు దేవానంద్ స్నేహం ఆజ్యం పోసింది. తన చేయూతతో గురుదత్ లోలోపలి భావ తరంగాలను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించడం మొదలుపెట్టాడు. కెమెరా అనే కుంచెతో అజరామర ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశాడు.
తాను కవి కానప్పటికీ, తనదైన మార్క్ చిత్రీకరణతో వెండితెరపై భావ కవితలు రాశాడు. భగ్న స్వాప్నికుడిలా జ్వలించాడు. ఓటములకు నిలువునా కుంగిపోయాడు. ఒంటరితనానికి బదులిచ్చేందుకు మధువుకు దగ్గరయ్యాడు. చివరకు తనువు చాలించాడు. 2025 ఆయన శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై ఓ క్లోజప్.
గురుదత్ అసలు పేరు వసంత్ కు మార్ శివశంకర్ పదుకొణె. ఆ యన 1925 జూలై 9న బెంగళూరులో జ న్మించాడు. కొన్నాళ్లు అక్కడే ఉన్న ఆయన కుటుంబం తర్వాత కలకత్తాకు వలస వెళ్లిం ది. గురుదత్ బాల్యమంతా కలకత్తాలోనే గడిచింది. 16 ఏళ్ల వయసులోనే చదువు మానే శాడు. స్థానికంగా టెలిఫోన్ ఎక్సేంజ్‌లో ఆపరేటర్‌గా పనిచేశాడు. తన బంధువు బీబీ బెనగల్ ప్రభావంతో సినిమాలపై ఆసక్తి పెం చుకున్నాడు.
ప్రముఖ న్యత్యదర్శకుడు ఉదయ్‌శంకర్ అకాడమీలో చేరాడు. అక్కడ కాస్త నృత్యం నేర్చుకున్నాడు. తర్వాత పుణెలోని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. ప్రభాత్ ఫిల్మ్‌కంపెనీలో నటుడు దేవానంద్‌తో పరిచ యం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహం గా మారింది. ప్రయాణంలో దేవానంద్ హీ రో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. 1951లో దేవానంద్ స్నేహితుడు గురుదత్ తో ‘బాజీ’ సినిమా తీయించాడు.
చిత్రంలోని పాటలు హిట్. గాయని గీతా దత్ ఆ చిత్రంలోని కొన్నిపాటలు పాడగా, అవి గురు దత్‌ను ఎంతో ఆకర్షించాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. 1953లో ఆ జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. గురుదత్ తర్వాత వరుసగా ‘జాల్’, ‘ఆర్ పార్’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అనంతరం మధుబాలతో కలిసి ‘మిస్టర్ అండ్ మి సెస్ 55’ మూవీని డైరెక్ట్ చేశాడు. చిత్రంలో గురుదత్ కథానాయకుడు కూడా ఆయనే.
వహీదా రెహ్మాన్ ‘రోజులు మారాయి’
తెలుగు ‘మిస్సమ్మ’ చిత్రాన్ని హిందీలో పునః నిర్మిద్దామనే ఆలోచనతో గురుదత్ 1955లో హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ ‘మిస్సమ్మ’ సినిమా చూసి అబ్బురపడ్డాడు. అదే పర్యటనలో గురుదత్ వహీదా రెహ్మాన్ నటించిన తెలుగు చిత్రం ‘రోజులు మారాయి’ని చూశాడు. వహీదా రెహ్మాన్ అతని దృష్టిని ఎంతో ఆకర్షించింది. వెంటనే ఆమె ను రాజ్ ఖోస్లా దర్శకత్వంలో తన బ్యానర్‌లో తీస్తున్న ‘సీఐడీ’ రెండో కథానాయకిగా తీసుకున్నాడు.
కొన్నేళ్ల పాటు తన చిత్రాల్లో నటించాలని అగ్రిమెంట్ తీసుకున్నాడు. కొ న్ని చిత్రాలు ఆమెతో తీసిన తర్వాత గురుదత్ అగ్రిమెంట్‌ను పక్కన పెట్టి, వహీదా ఇత ర సినిమాల్లో నటించేందుకు అనుమతి ఇచ్చాడు. తర్వాత వహీదాకు వృత్తిపరంగా గురుదత్ అవసరం ఇక లేకపోయిందని నా డు సినీవర్గాల్లో చర్చ నడిచింది. అది గురుదత్ చెవినపడి ఆయన వహీదాను దూరం పెట్టడం ప్రారంభించాడు.
భార్యాపిల్లలు దూరం..
1953లో తాను ప్రేమించిన గాయని గీతా రాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్‌లో గురుదత్ వివాహమైంది. గురుదత్ హవా కొనసాగుతున్న సమయంలో నటి వహీదా రెహ్మాన్ కూడా చిత్ర రంగంలో నిలదొక్కుకుంటున్నది. అప్పట్లో వీరిద్దరిపై ఎన్నో వదంతులు ఉండేవి. అవి గీతా రాయ్ చెవినపడి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటికే వారికి ము గ్గురు పిల్లలు. అనుమానం పెనుభూతంగా మారగా గీతా రాయ్ పిల్లలతో ఇంట్లో నుం చి వెళ్లిపోయింది.
గురుదత్ దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘కాగజ్ కే ఫూల్’ (1959). ఈ చిత్రం బోల్తాకొట్టింది. ఆ చిత్రాన్ని ‘చనిపోయిన శిశువు’గా అభివర్ణించాడు. తర్వాత కొన్ని సినిమాల్లో ఆయన నటించినప్పటికీ, ఆయనకు ఆవేమీ సంతృప్తినివ్వలేదు. 1964లో వచ్చిన ముఖర్జీ సినిమా ‘సాంఝ్ ఔర్ సవేరా’ గురుదత్ ఆఖరిచిత్రం.
భార్యాపిల్లల దూరం కావడం, సినిమాల్లో విఫలమైన తర్వాత గురుదత్ మద్యానికి బానిసయ్యాడు. ఒకటి రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా ప్రాణాలతో బయ టపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ గురుదత్ మద్యంలో లెక్కకు మించిన నిద్రమాత్రలు వేసుకుని సేవించాడు. కన్నుమూశాడు.
తిమిర
ప్రపంచ వంద గొప్ప చిత్రాల్లో ‘ప్యాసా’కు స్థానం
నిజానికి 1962లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మూడు రోజుల తర్వాత గురుదత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తర్వాత మరోసారి కూడా అలాగే జరిగింది. కానీ, మూడోసారి ఆయన ప్రాణాలతో బయటపడలేకపోయాడు. గురుదత్‌ను చివరి సారి సజీవంగా చూసింది తన స్నేహితుడు అబ్రార్ అల్వీ. గురుదత్ మొత్తంగా ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించాడు.
వాటిలో ఐదు చిత్రాలు నిర్మించారు. నటుడిగా 20 చిత్రాల్లో నటించాడు. తనువు చాలించే నాటికి ఆయన వయస్సు కేవలం 39 ఏళ్లు మాత్రమే. ఆయన చిత్రపరిశ్రమకు దూరమై 61 ఏళ్లవుతుంది. ‘టైమ్స్ మ్యాగజైన్’ ప్రపంచ 100 గొప్ప చిత్రాల జాబితాలో గురుదత్ ‘ప్యాసా’ (1957) స్థానం సంపాదించుకున్నది.
సిగ్గరి.. మొండివాడు..
నిజానికి గురుదత్ తనను తాను గొప్ప నటుడని ఏనాడూ అనుకోలేదు. ‘ప్యాసా’లో కథానాయక పాత్రకు దిలీప్ కుమార్‌ను ఎంచుకున్నారు. కానీ, కొన్నికారణాలతో దిలీప్‌కుమార్ ఆ పాత్రను వదులుకున్నారు. గురుదత్ చిత్రాలను చూసి చాలామంది బయట చలాకీగా ఉంటాడని అనుకుంంటారు. నిజానికి ఆయన అంతర్ముఖుడు. సిగ్గరి. ఆయనకు ముక్కుమీదే కోపం. సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఎంతో మొండిపట్టుతో ఉండేవాడు.
సాధారణంగా సినిమా రంగంలో ఉన్నవారికి హంగూ ఆర్భాటాలు ఉంటాయి. అవేవీ గురుదత్‌ను ఆవహించలేదు. ఆయనకు బంధు ప్రీతి ఉండేది కాదు. వంది మాగధుల భజనలకు అసలు ఆస్కారమే లేదు. తనకు శాస్త్రీయ సంగీతమంటే ప్రాణం. అలాగే పెంపుడు జంతువులన్నా ఆయనకు ఎంతో ఇష్టం. గురుదత్‌కు సాహిత్యం కూడా చదివేవాడు. బెర్నార్డ్ షా, షేక్‌స్పియర్ రచనలను ఇష్టంగా చదివేవాడు.
దత్‌జీలో నేను దర్శకుడినే చూశాను..
‘నేను దత్‌జీని ఎల్లప్పుడూ దర్శకుడిగానే చూశాను. నటుడిగా కాదు’ ‘గురుదత్ నాతో నిర్మించిన చిత్రాలతోనే నాకు హిందీ చిత్ర పరిశ్రమలో నాకు స్టార్‌డమ్ వచ్చింది’ ‘గురుదత్ గొప్ప డైరెక్టర్. ఆయన నటులను బాగా అర్థం చేసుకుంటారు. ఆయన సినిమాల్లో నటీనటులకు సీన్ మాత్రమే వివరిస్తారు. మిగతాది ఆ పాత్రధారులకు వదిలేస్తారు’ ‘గురుదత్ ఇతరులను ఎంతో అర్థం చేసుకునేవారు.
అడక్కపోయినా కానీ ఆయనే ప్రతి సంవత్సరం రెమ్యునరేషన్ పెంచేవారు’ ‘గురుదత్‌కు తను చేసే పని ఎంతో ఇష్టం. సాటి మనుషులన్నా కూడా అంతే ఇష్టం. ఆయన తరచూ చావు గురించి మాట్లాడుతుండేవాడు. చావుకోసం ఎదురు చూసే వాడు. గురుదత్ ఎప్పుడూ జీవితంలో రెండే రెండు ఉంటాయని చెప్పేవాడు. ఒకటి గెలుపు, రెండోది ఓటమి. ఆ రెండిటిని తాను చవిచాశానని, ఇక జీవించడంపై తనకు ఏమాత్రం ఆకర్షణ లేదని చెప్పేవాడు’
* నా జీవితంలోకి ఎంతోమంది వచ్చారు. వెళ్లారు. ఆ పయనంలో గురుదత్‌ది ప్రత్యేక స్థానం. మేమిద్దరం ఒకేసారి సినీ ప్రయాణాన్ని ప్రారంభించాం. నేను గర్వంగా చెప్పగలను. గురుదత్ నాకున్న ఏకైక మిత్రుడు
దేవానంద్, నటుడు
* దత్‌జీ తనకు తానే పెద్ద విమర్శకుడు. తాను ఎవరిని ప్రేమించినా, ఇష్టపడినా ఆ స్థాయి తీవ్రంగా ఉంటుంది. కానీ, అది గురుదత్ అభివ్యక్తిలో కనిపించదు.
రాజ్‌ఖోస్లా, దర్శకుడు
* గురుదత్ తన రచయితలు రాసిన దానితో ఎప్పుడూ సంతృప్తి చెందేవాడు కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ మథనం జరిగేది. షూటింగ్ ప్రదేశం వద్ద ఆయనకు ఎన్నో ఆలోచనలు వచ్చేవి. అలా తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి.
అబ్రార్ అల్వీ, దర్శకుడు, గురుదత్ స్నేహితుడు
* దత్‌జీ చిత్రాలు కాలాతీతమైనవి. వెండితెరపై ఆయన చిత్రాలు అద్భుతమైన కళాఖండాలు. నిజానికి నేను కూడా వెండితరపై మరో గురుదత్ కావాలని ముంబై వెళ్లాను. కానీ, నేను ముంబై చేరుకున్న కొద్దిరోజులకే ఆయన తనువు చాలించడం పెద్ద విషాదం. పరిస్థితులేమైనా గానీ, నేను రచయితను అయ్యాను.
జావెద్ అక్తర్, గేయ రచయిత