04-05-2025 12:16:40 AM
తెలంగాణ ప్రాంత ప్రజలు పోరాటానికి స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తారు. నైజాం పాలకుల విముక్తి కోసం ఆనాడు దీక్షతో పోరాటం చేశారు. ఫలితంగా బానిస బతుకుల నుంచి విముక్తి లభించింది. ఎంతోమంది పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే.. తప్ప విముక్తి లభించింది. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన ఈ ప్రాంతాన్ని భాష ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రంలో కలపడం ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
ఆంధ్రోళ్ల పాలనలో నిధులు, నియామకాలు, ఆర్థిక, సామాజిక అంశాలపై తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు జరుగుతున్న నష్టాన్ని భరించలేక 1969లో తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చింది. ఎంతోమంది రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించినప్పటికీ కొన్ని శక్తులు తెలంగాణ రానీవ్వకుండా అడ్డుపడ్డ ఘటనలు ఉన్నాయి. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆంధ్రా శక్తులు ఒక్కటై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని అణగదొక్కారు. ఆంధ్రా పెత్తందారుల పాలనలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా అణచివేతకు గురైంది.
స్వరాష్ట్ర సాధన కోసం మొదలైన మలిదశ ఉద్యమం ఎంతో కీలకంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి స్వరాష్ట్రాన్ని సాధించింది. రాష్ట్ర సాధన కోసం యువత బలిదానాలకు సైతం పాల్పడ్డారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో అలసత్వం కనిపిస్తున్నది. 12 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైన ఉన్నది. వ్యవసాయం బాగుపడితేనే దేశం బాగుపడుతుందని అనడం తప్ప.. అన్నదాతల ఆత్మహత్యల నివారణపై ఏమాత్రం చర్యలు కనిపించలేదు. అవినీతి, అక్రమాలపై ప్రభుత్వాలు నిక్కచ్చిగా వివరించాల్సిన పరిస్థితి ఉంది.
చిప్ప సురేష్, కుమ్రం భీం ఆసిఫాబాద్
సామాజిక స్పృహతోనే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే.. అన్ని రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు మన రాష్ట్రంలో.. మన పాలన కొనసాగుతుందని ఎంతో ఆశతో ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమంలో ఉద్యోగులు చేపట్టిన పోరాటంలో ఎంతో కీలకంగా వ్యవహరించాం. నా భార్య హరిప్రియ నన్ను ప్రోత్సహించడమే కాకుండా తాను సైతం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా పెద్దగా మార్పు కనిపించడం లేదు.
ప్రధానంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి రంగాన్ని అభివృద్ధి పరిస్తే రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిన ఇంకా విత్తనం పెట్టినట్టుగానే కనిపిస్తుంది. దేశంలో తెలంగాణ మహావృక్షంగా పెరిగి అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నాను.
వెంకటేశ్వర్లు