calender_icon.png 18 October, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజ్.. గలీజ్

17-10-2025 01:23:29 AM

- నల్లగొండ మున్సిపాలిటీలో వసూళ్ల పర్వం

- డ్రైనేజీ కనెక్షన్‌కు రూ.5వేలు

- డమ్మీ నల్లా కనెక్షన్ ఇవ్వాలంటే రూ.3వేలు

- అట్లయితేనే సీసీ రోడ్లు వేస్తం..

- కాంట్రాక్టర్ల నయా దందా

- చోద్యం చూస్తోన్న మున్సిపల్ యంత్రాంగం

నల్లగొండ, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : నల్లగొండ మున్సిపాలిటీలో అక్రమాల పర్వం నడుస్తోంది. చేయి తడిపితే గానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు. అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న అక్రమాలు చాలవన్నట్టు.. ఆ పనులు నిర్వహించేందుకు సైతం కాసుల కక్కుర్తికి తెగబడుతున్నారు. కాంట్రాక్టర్ల అరాచకానికి అధికారుల నిర్లక్ష్యం తోడవ్వడంతో మున్సిపల్ వాసులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. నిజానికి నల్లగొండ మున్సిపాలిటీలో రోజుకో అక్రమ బాగోతం వెలుగులోకి వస్తోంది. తాజాగా డ్రైనేజీ కనెక్షన్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు సైతం రూ.5వేలు వసూలు చేయడం బట్టబయలయ్యింది. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్ యంత్రాంగం మాత్రం మొద్దునిద్రను వీడడం లేదు.

అసలేం జరిగిందంటే...?

నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తు తం అభివృద్ది పనుల పేరుతో సీసీ రోడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టారు. అయి తే ఆయా కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేసే సమయంలో ఇండ్లు, ఖాళీ ప్లాట్లు, ఇండ్లు నిర్మించుకోవాలని భావించే వినియోగదారులకు కాంట్రాక్టర్లు కొత్త గుబులు పుట్టించారు. సీసీ రోడ్లు నిర్మాణం చేయకముందే డ్రైనేజీ కనెక్షన్‌తో పాటు నల్లా కనెక్షన్ తీసుకోవాలని, లేకుంటే మళ్లీ కనెక్షన్ ఇవ్వబోరంటూ ప్రచారం చేశారు. దీంతో సీసీ రోడ్లు వేసేందుకు రెండుమూడు రోజుల సమయం ఉండడం వల్ల ప్రజలు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు డ్రైనేజీ కనెక్షన్ కోసం రూ.5వేలు, నల్లా డమ్మీ కనెక్షన్ కోసం రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రజలు అడిగితే.. అలా అయితేనే కనెక్షన్ ఇస్తాం.. లేకుంటే మీ ఇష్టం అంటూ భయపెడుతున్నారు. దీంతో చేసేదేం లేక ప్రజలు అప్పు చేసి మరీ రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు సమర్పించుకోవడం కొసమెరుపు.

స్థానికులతో గొడవ.. భారీగా వసూళ్లు

నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగానే స్థానికుల నుంచి నల్లా కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్ కోసం భారీగా వసూళ్లు చేశారు. నల్లా కనెక్షన్ కోసం రూ.3వేలు, డ్రైనేజీ కనెక్షన్ కోసం రూ.5వేలు వసూలు చేశారు. ఇదేంటని అడిగితే.. కాంట్రాక్టరుకు సంబంధించిన సూపర్ వైజర్లు, ఇంజనీర్లు స్థానికులతో గొడవకు దిగడం కొసమెరుపు. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్ యంత్రాంగం మాత్రం మొద్దునిద్ర వీడడం లేదు. ఓవైపు కార్యాలయంలో ప్రజలకు పనులు చేసే విషయంలో భారీగా ముడుపులు తీసుకుంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు అభివృద్ధి పనుల విషయంలోనూ ఇలాంటి ముడుపులు వసూలు చేయడంపై మున్సిపల్ యంత్రాంగంపై ప్రజలు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అసలు నల్లగొండ మున్సిపాలిటీకి కమిషనర్ ఉన్నట్టా..? లేనట్టా..? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తపరుస్తుండడం గమనారం.