calender_icon.png 19 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామకరణ వివాదాలు

05-01-2025 12:00:00 AM

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో కొత్తగా నిర్మించబోయే ఓ కాలేజీకి హిందుత్వవాది వీర్ సావర్కర్ పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కళాశాలకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ప్రధాని ఈ కాలేజీకి శంకుస్థాపన చేయడానికి ముందే దానికి సావర్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం మొదలైంది.

సావర్కర్ అప్పట్లో బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పి వారినుంచి పింఛను పొందారని, అలాంటి వ్యక్తి పేరును కళాశాలకు పెట్టొద్దంటూ కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలను స్థాపించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఈ కళాశాలకు పెట్టాలంటూ వారు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

అయితే సావర్కర్ పేరు విషయంలో  తగ్గేదే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది కాస్తా వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో కశ్మీర్‌పై రాసిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ చేసిన ఓ వ్యాఖ్యసైతం దుమారం రేపింది.

కశ్మీర్‌కు పురాణాల్లో ‘కశ్యప్’ అనే పేరుండేదని ఆయన యదాలాపంగా అన్నమాటలు వివాదం రంగు పులుముకున్నాయి. కశ్మీర్ పేరును మార్చే ఉద్దేశం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉన్నట్లుగా ఉందని, అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం స్పందించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరూ కశ్మీర్ పేరును మార్చలేరంటూ స్పష్టత ఇచ్చారు. 

అసలు పేర్ల విషయంలో ఇంతగా వివాదాలు ఎందుకు వస్తున్నాయనే అనుమానం ఎవరికైనా వస్తుంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో ముస్లిం పేర్లతో ఉన్న అనేక ఊర్ల పేరుతో పాటు చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాల పేర్లను మార్చడమే దీనికి కారణం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్‌సరాయ్ జంక్షన్‌ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చేశారు.

అలాగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం అరుణ్ జైట్లీ స్టేడియంగా మారిపోయింది. రేపో, మాపో లక్నో పేరును లక్ష్మణ్ నగరిగా మార్చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అన్నిటికన్నా మించి ప్రసిద్ధ రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్, మొఘల్ గార్డెన్‌కు అమృత్ ఉద్యాన్‌గా నామకరణం చేశారు. ఇవన్నీ పెద్దగా వివాదాస్పదం కాలేదు కానీ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మార్చినప్పుడు పెద్ద వివాదమే చెలరేగింది.

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న ఈ మ్యూజియం పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పింది. అయితే సంఖ్యాబలం మెండుగా ఉన్న మోదీ సర్కార్ తన పంతాన్నే నెగ్గించుకుంది. అలాగే ఢిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి వివిధ దేశాధి నేతలకు పంపిన ఆహ్వానపత్రాల్లో ఇండియా పేరును ‘భారత్’గా పేర్కొనడంపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు.

దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ప్రధాని మోదీ రాజ్యాంగాన్నే వక్రీకరిస్తున్నారంటూ అప్పట్లో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పేరు మార్పు ఆలోచనను మోదీ సర్కార్ విరమించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

అయితే పేరుమార్చినంతమాత్రాన దాని చరిత్ర మారదని, ఆ విషయాన్ని రాజకీయ పెద్దలు గమనించాలని విజ్ఞులు అంటున్నారు. ఎవరేమి చెప్పినా అధికారంలో ఉన్న నేతలు మాత్రం పేరుమార్పు ఉబలాటాన్ని వీడడంలేదు. అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకటే తంతు. దీనికి ఫుల్‌స్టాప్ అంటూ ఉండదేమో!