23-07-2025 12:09:03 AM
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘అవతార్’. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించడమే కాకుండా విజువల్ ఎఫెక్ట్స్‌తో అందులోని ప్రకృతి అందాలను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘అవతార్’ ఫ్రాంచైజీకి సీక్వెల్‌గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అంటూ వచ్చి, మరోమారు ప్రపంచవ్యాప్తం గా ఉన్న పలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశారు. ఇప్పుడు మూడో భాగంగా పంచభూతాల్లో ఒక్కటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దుతున్నారు.
ఇది ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరుతో డిసెంబర్ 19న విడుదల కానుంది. మొత్తం ఐదు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్రాంచైజీకి సంబంధించి ‘అవతార్4’ 2029లో, ‘అవతార్5’ 2031 డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇదిలా ఉండగా మూడో భాగానికి సంబంధించి తాజాగా టీమ్ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన ‘వరంగ్’ పాత్రను ఈ పోస్టర్‌లో పరిచయం చేశారు. ఈ సినిమాకు సంబంధించి మొదటి ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయనున్న విషయాన్నీ ప్రకటించారు. అదేరోజు రిలీజ్ కానున్న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ చిత్రం ప్రదర్శనకు ముందు థియేటర్లలో ‘అవతార్3’ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు.