21 August, 2026 | 5:03 AM

రాజీవ్ స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధికి అంకితం కావాలి

21-08-2026 01:48 AM

గజ్వేల్, ఆగస్టు 20: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, పట్టణ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుకేందర్ రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో వారు  మాట్లాడారు. రాజీవ్ గాంధీ కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్, ఐటీ, రక్షణ, విమానయాన రంగాలకు ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించారన్నారు.

18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాజీవ్ అందించిన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న భారత యువత నేడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంగనూరి సత్యనారాయణ గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి, నక్క రేగొండ గౌడ్, అమరేందర్, రాములు గౌడ్, సమీర్, గాడిపల్లి శ్రీనివాస్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్, నరేష్, అజార్, జకీర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.