ఓబీసీ కాలాన్ని చేర్చాలని...
జన గణన ప్రతుల దహనం
మంచిర్యాల టౌన్, ఆగస్టు 20 : కేంద్ర ప్రభుత్వం జన గణన ప్రతులల్లో ఓబీసీ కాలాన్ని చేర్చకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గురు వారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జన గణన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్బంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ జన గణనలో భాగంగా బీసీ కులగణన చేపడుతామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ మాటను విస్మరించి బీసీలను మోసం చేస్తున్నారన్నారు.
కులగణన చేపడితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ లు పెంచాల్సి వస్తుందని, అలాగే చట్ట సభల్లో రిజర్వేషన్ పెంచాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే ఉద్దేశంతో బీసీల ఎక్కింపులో ఓబీసీలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీసీల ఉద్యమ ఆకాంక్షను గుర్తించాలని డిమాండ్ చేశారు. అనంతరం కులగణన ప్రతులను దహనం చేసారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, ప్రజావాణి సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్ వర్మ, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా మహమ్మద్ లతీఫ్, న్యాయవాది సురేందర్ చారి, బీసీ నాయకులు చంద్రగిరి చంద్రమౌళి, పెద్దల చంద్రకాంత్, అంకం సతీష్ ,పడాల శివతేజ, ఆరండుల రాజేశం, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.






