calender_icon.png 28 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఈసారి తగ్గేదేలే..

28-11-2025 01:01:57 AM

- గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి యువత సిద్ధం

-ఎన్నికలు రసవత్తరంగా మారడం ఖాయం

మఠంపల్లి, నవంబర్ 27 (విజయ క్రాంతి): మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలో దాదాపుగా సగం గ్రామ పంచాయతీ పరిధిలో యువత ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.మండలంలో భీల్యానాయక్ తండా,మఠంపల్లి, మట్టపల్లి, పెదవీడు, కాల్వపల్లి తండా, కొత్త దొనబండ తండా,పాత దొనబండతండా,జామ్లాతండ, మంచ్యాతండ, యాతవాకీళ్ళ గ్రామ పంచాయతీలో ఈ సారి యువత స్థానిక సమరా నికిసై అంటూ కాళ్లు దువ్వుతున్నారు.

ఇంకా ఎన్నాళ్లు జెండాలు మోయాలి,బ్యానర్లు కట్టాలి.ఇంకా ఎన్ని రోజులు వీళ్లే ఊరిని ఏలుతారు...! మాకు ఒక అవకాశం కావాలి. లేకుంటే ఈ సారి ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ తమ తమ బలాబలాను బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి సర్పం సాబ్ అని పిలుపించుకోవాలని దాదాపు మండలంలోని ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ కోసం వేచి చూస్తున్న యువత ఎక్కడా తగ్గకుండా ఎన్ని లక్షలైనా సరే ఖర్చు చేయడానికి తగ్గేదేలే అని సవాళ్లు విసురుతున్నారు.

గ్రామలలో ప్రత్యేక కార్యక్రమాలు

గ్రామానికి సర్పం కావాలని ఆలోచన ఉన్నవాళ్లు గ్రామంలోని వార్డులో ఎవరు బరిలో ఉంటే తనకు ఓట్లు పడతాయో వారిని గుర్తించి తమ వెంట తిప్పుకుంటున్నారు. అవసరమైతే వారికి ఆర్ధికంగా సహాయం కూడా చేస్తున్నారు. వీలైనప్పుడు గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు మండల స్థాయి నేతలను పిలిచి వారి దృష్టిలో పడేందుకు తిప్పలు పడుతున్నారు. ప్రతి చిన్న ఈవెంటుకు అన్నదానం చేసి ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంకా కొందరు చివరి అస్త్రంగా కుల రాజకీయాలకు కూడా తెర లేపారు. ఓటరు ఏ పార్టీ వాడైనా సరే సర్పం రేసులో ప్రత్యర్థి అభ్యర్థి తమ కులం వాడు ఉంటే ఓటు వేసేలా మోటివేషన్ చేయడానికి ప్రత్యేక టీంలను గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారని సమాచారం.

ప్రజలకు సేవ చేయడానికా.. లేక స్వలాభం కోసమా

స్థానిక స్వయం పరిపాలన అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. సర్పం అంటే గ్రామ నిర్ణయ రూపకర్తల పెద్ద. ఇలాంటి ఒక అత్యున్నతమైన సర్పం పదవిని యువత ఎందుకోసం కోరుకుంటుంది. సర్పం పదవిని దక్కించుకునేందుకు ఎన్ని లక్షలైనా, కోట్లయినా ఖర్చు చేసేందుకు తగ్గేదేలే అని బహిరంగంగానే ఎందుకు చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంటే యువత దృష్టిలో సర్పంచి పదవి అనేది బాధ్యతాయుతమైన పదవిలా కాకుండా తన పలుకుబడిని, పరపతిని పెంచుకోవడానికి ఒక ఆభరణంగా చూస్తున్నారా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అని అందరిని ఒకేలా చూడలేము.ఎన్నికల హడావిడి లేకముందు నుండే కొందరు గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు సహాయంగా ఎంతో కొంత ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు.ఏది ఏమైనా యువత గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడి  డబ్బులు ఖర్చు చేసి గెలిచిన నాయకుడిగా కాకుండా స్వతహాగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా గెలిస్తే బాగుంటుందని సీనియర్ రాజకీయ నాయకులు వారికి సలహా ఇస్తున్నారు.

డబ్బులు ఖర్చు చేయకుండా జనం మెచ్చిన నాయకుడిగా.. ప్రజా నాయకుడిగా గెలుపొందిన హితవు పలుకుతున్నారు.తర్వాత మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని మరీ ముఖ్యంగా పార్టీలకు తలనొప్పిగా యువ అభ్యర్థులు సర్పం ఎన్నికలలో పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగనప్పటికీ తమ పార్టీల నుండి ఒక అభ్యర్థి పేరును ఫైనల్ చేయడం ఆనవాయితీ.కానీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా అని అభ్యర్థులే ఎవరికివారు చెప్పుకుంటూ తమ తమ బలాలను బహిరంగ రహస్యంగా ప్రదర్శిస్తున్నారు.

ఇప్పుడు వీరిలో గెలుపు గుర్రాన్ని కనిపెట్టి పార్టీ తరఫున అభ్యర్థిని ఫైనల్ చేయడంలో పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని అడ్వాంటేజ్ గా ఇతర పార్టీలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా మారడం ఖాయం.