calender_icon.png 8 September, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ ప్రసక్తే లేదు

08-09-2025 12:00:00 AM

  1. రూ.62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
  2. ఆర్‌ఆర్‌ఆర్ భాదిత రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతా
  3. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడను
  4. సంస్థాన్ పర్యటనలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

సంస్థాన్ నారాయణపూర్, సెప్టెంబర్ 07 (విజయక్రాంతి): విద్యార్థుల వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు,అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పాఠశాల మొత్తం పరిశీలించారు.

విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకుని సరిపడా తరగతి గదులు, డార్మెటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు.విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని క్రమశిక్షణతో చదువుతూ ముందుకు వెళ్లాలని సూచించారు.విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సీజనల్ వ్యాధుల సమయంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ప్రతివారం సిబిపి టెస్టులు నిర్వహించాలని, జ్వరాల బారిన పాడిన విద్యార్థినులకు ఇక్కడే మెరుగైన చికిత్స అందించి నయం అయిన తర్వాతే వారి ఇంటికి పంపించాలని సూచించారు. అనంతరం నారాయణపురం మండలంలో ఆర్‌ఆర్‌ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులను కలుసుకొని వారి సమస్యలను అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే నైనా ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడుతానని అన్నారు.

అవసరమైతే ఇంతటి త్యాగానికైనా వెనకాడనని ప్రజల సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.అవసరమైతే రైతుల తో పాటు తాను పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నుండి, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య అన్ని చోట్ల సమానమైన పొడవు ఉండాలి కానీ మునుగోడు నియోజకవర్గం వరకు వచ్చే సరికి పొడవు తగ్గిందని అన్నారు. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుందని అది విడదీయలేనిది అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్ లో మునుగోడు నియోజకవర్గం రైతులే అత్యధికంగా భూములు కోల్పోతున్నారని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ లో భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని,అవసరమైతే కేంద్రమంత్రులతో మాట్లాడుతానని రైతులకు న్యాయం జరిగే వరకూ కలిసి పోరాడుతానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుకుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, మండల అధ్యక్షులు శ్రీను, మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ వంకడోత్ బుజ్జి, గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, మండల నాయకులు ఉప్పల లింగస్వామి, మాజీ సర్పంచ్ దోనూరి జైపాల్ రెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్, ముద్దంగుల నరసింహ,తదితరులు పాల్గొన్నారు.