05-11-2025 01:36:28 AM
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలోని ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం మంగళ వారం జరిగింది. ఈ వేడుకకు మంచు మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. “ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ప్రేమ ఒక్కటే. అది అందరిది. ప్రేమ పుడితే అంతే. ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ పాటలో ‘రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటా’ అన్నట్టు.. నేనూ మౌనికకు మాటిచ్చా.
‘అందరూ అనుకున్నట్టు నాకు రాజ్యాలు లేవు. నేను ఒక్కడినే ఉన్నా. ప్రస్తుతానికి సినిమాలు కూడా చేయడంలేదు. కానీ, కచ్చితంగా మళ్లీ నటిస్తా. కష్టపడతా. జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటా. నన్ను నమ్ముతావా’ అని అడిగా. తను నన్ను నమ్మింది. మిమ్మల్ని నమ్మి వచ్చినవారి చేయి వదలకండి” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.
అఖిల్, తేజస్విని జంట గా నటిస్తున్న చిత్రమే ‘రాజు వెడ్స్ రాంబాయి’. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. కార్యక్రమంలో హీరో అఖిల్ ఉడ్డెమారి, హీరోయిన్ తేజస్వినీ రావ్, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్, సింగర్ నల్లగొండ గద్దర్ నర్సన్న, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, చిత్రబృందం పాల్గొన్నారు.