31-07-2025 01:06:43 AM
జనగామ, జూలై 30 (విజయక్రాంతి): జనగామ జిల్లాలో ఎరువులకు కొరతలేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. జిల్లాలోని చిల్పూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిన్న పెండ్యాల లో ఎరువుల షాపులను సందర్శించి యూరియా స్టాక్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు నోటీసు బోర్డుపై ఎరువుల స్టాకు వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులతో సంభాషించి విద్యా బోధన తీరుపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం రుచిగా ఉంటుందా, ఏవైనా సమస్యలుంటే చెప్పండని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మల్కాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
రికార్డులను పరిశీలించి మందుల నిల్వలను, పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు సిబ్బందికి ఒకేరోజు సెలవులు మంజూరు చేయడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే తప్ప సెలవులు మంజూరు చేయకూడదని ఆదేశించారు. సెలవులు మంజూరు చేసిన అధికారికి మెమో జారీ చేసి వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం రవాణాలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరత్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టి ఎప్పటికప్పుడు ఫోటోలతో ఆన్లైన్ చేసి లబ్ధిదారులకు బిల్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాజవరం ప్రైమరీ పాఠశాల అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.