17 April, 2026 | 2:34 AM

బీజేపీలో బీఆర్‌ఎస్ కలిసే ప్రసక్తి లేదు

01-06-2025 01:16 AM

- పార్టీని బలహీనం చేసేందుకు కుట్ర

- మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి

హైదరాబాద్, మే 31(విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీలో కలవబోతుందని అని కొందరు కావాలనే కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలంగాణ శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.

తెలంగాణభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించారని, తెలంగాణ అంటే నక్సలైట్లన్న సందర్భంలో ఆయన పార్టీని పెట్టారని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా టీఆర్‌ఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. ఇద్దరు బలమైన నాయకులైన చంద్రబాబు, వైఎస్‌ఆర్‌లను ఢీకొన్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, తెలంగాణ సాధించి సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని చెప్పారు.

కేసీఆర్ పాలనపై చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీల రాజకీయ పునాదులు కదులుతాయన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పారు. పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆరే తీసుకుంటారని తెలిపారు.