15-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి): స్కిల్ హబ్ ద్వారా ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సోలుషన్స్ కంపెనీలో చేరిన సుమారు 200 మంది ఉద్యోగులు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో రోడ్డున పడ్డారని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. నిరుద్యోగుల ఆశలను తమకు అవకాశంగా మార్చుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నా కొందరు ప్రబుద్ధులు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్నారని, రూ. లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న సంఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయని, వీటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అయన విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉద్యోగాలకోసం ఒక్కొక్కరు సుమారు రెండు లక్షలు ఇచ్చి మోసపోయిన ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సోలుషన్స్ కంపెనీ ఉద్యోగులు డాక్టర్ దిడ్డి సుధాకర్ ను కలసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయని అన్నారు.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారెంటీ అంటూ నిరుద్యోగులను ఆకర్షించి స్కిల్ హబ్ కన్సల్టెన్సీ సంస్థ మోసపూరితంగా ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ లో ఉద్యోగాలు ఇప్పించిందని, ప్యూరోపాల్ ఐటీ సొల్యూషన్స్ ఒక్కొక్కరి నుండి లాప్ టాప్, సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిందని, చేరిన రెండు నెలలకే జీతాలు కూడా ఇవ్వకుండా ఆ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, దింతో దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు.
ప్యూరోపాల్ ఐటీ సోల్యూషన్స్ కంపెనీ మోసంపై గుచ్చి బౌలి పోలీస్ స్టేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేస్తుందని, వారి డబ్బులు వారికీ ఇప్పించి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలనీ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు విజయ్ ముల్లంగి, నర్సింగ్ యమునా గౌడ్, సుధారాణి, రమ్య గౌడ్, అజీజ్ భైగ్, మహమ్మద్ షాబాజ్, ఖాన్, ఎస్.ఎన్. రెడ్డి, సోహైల్, ఎహసాన్ తదితరులు పాల్గొన్నారు.