17-08-2025 12:54:23 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): దంపతుల ఆర్థిక పరిస్థితులో, ఆలస్యంగా పిల్లలను కనాల నుకుంటున్నారో.. లేదంటే ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారో ఏమోగానీ.. దేశంలో అబార్షన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశం. తల్లి గర్భంలో పడగానే గర్భవిచ్ఛిత్తి చేసి చంపేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ చేసిన సర్వేలో ఏ రాష్ట్రంలో ఎన్ని అబార్షన్లు అవుతున్నాయో తేలింది.
ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంటుకు సమర్పించారు. ఈ సర్వే ప్రకారం మహారాష్ర్టలో ఈ ఏడాది 2,07,019 అబార్షన్లతో మొదటి స్థానంలో నిలిచింది. 1,01,414 అబార్షన్లతో రెండో స్థానంలో తమిళనాడు నిలిచింది. 76,642 అబార్షన్లతో మూడో స్థానంలో అసోం, నాలుగో స్థానంలో కర్ణాటక (70,241), ఐదో స్థానంలో రాజస్థాన్ (53,714) ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అబార్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో ఐదేండ్ల క్రితం అంటే 2020 1,578 అబార్షన్లు జరగగా ఈ ఒక్క ఏడాదిలోనే 16,059 అబార్షన్లు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ లెక్కను మన రాష్ట్రంలో 917 శాతం అబార్షన్లు పెరిగాయి. ఏపీ విషయానికి వస్తే 2020 2,282 అబార్షన్లు జరగ గా.. 2024 వచ్చే సరికి ఆ సంఖ్య 10,676కు చేరింది.
ఈ లెక్కన ఏపీలో 317శాతం అబార్షన్లు పెరిగాయి. అబార్షన్లు జరిగేందుకు అనేక కారణాలున్నా యని తెలుస్తోంది. కొందరికి ఆర్థిక పరిస్థితులు సహకరించక అబార్షన్లు చేయించుకుంటే.. ఇంకొందరు ఆరోగ్యం సహకరించక కడుపులోనే బిడ్డను చంపుకుంటున్నరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆర్థి క సమస్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
కొన్ని జంటలు మాత్రం పిల్లలను పోషించడం భారం గా భావించి అబార్షన్లు చేయించుకుంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసే వారి విషయానికి వస్తే ఇల్లు కొనుక్కుని, ఇతర అవసరాలు అన్నీ తీరిని తర్వాత పిల్లల్ని కనాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే గర్భం దాల్చితే అబార్షన్లు చేయించుకుం టున్నారని తెలిసింది.