calender_icon.png 19 November, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెట్స్‌లో నన్ను అలా కూడా వాడేస్తారు!

16-11-2025 12:00:00 AM

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘12ఏ రైల్వేకాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘పొలిమేర’ సినిమాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయడమే కాక షోరన్నర్‌గానూ పనిచేస్తున్నారు. నవంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా కథానాయకి కామాక్షి భాస్కర్ల శనివారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలివీ.. 

అనిల్ విశ్వనాథ్‌తో నా జర్నీ ‘-పొలిమేర’తో ప్రారంభమైంది. నిజానికి నాకు నటనతోపాటు రైటింగ్ కూడా ఇష్టమే. ‘పొలిమేర’ అప్పుడే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తానని ఆయనను అడిగా. ‘పొలిమేర’లో నా నటనను అందరూ అభినందించారు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు పాత్రలెందుకు ఇవ్వకూడదనేది అనిల్ ఉద్దేశం. అలా ఆయన రెండు సినిమాల్లోనూ నేనుండటానికి కారణం. 

ఇందులో నేను నరేశ్‌కు జోడీగా కనిపిస్తా. నా పాత్ర పేరు ఆరాధన. నా క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఏం చేస్తుందనేది సినిమా చూసే తెలుసుకోవాలి. తన పని మీదే శ్రద్ధ పెట్టే క్యారెక్టర్ నాది. ఆ పాత్ర జీవితంలో మొదలయ్యే ప్రేమకథ ఎలా ముందుకెళ్లిందనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. -ఆరాధన క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర గుర్తుండిపోతుంది. 

నరేశ్‌తో ఇంతకుముందు ‘ఇట్లు మారేడుమిల్లి’ సినిమా చేశా. ఇది రెండో చిత్రం. నాకు చిన్నప్పటినుంచి నరేశ్ వ్యక్తిగతంగా తెలుసు. నరేశ్ చాలా సైలెంట్ పర్సన్. అద్భుతమైన నటుడు. మేము ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుతుంటాం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. 

కథలో కీలకమైన పాత్రలు చేయాలనే భావిస్తున్నా. శ్రీవిష్ణు, సుహాస్, విజయ్ సేతుపతి.. ఇలా చాలా మంది హీరోలు అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఫిమేల్ యాక్ట్రెస్‌కి ఆ యాక్సెప్టెన్సీ లేదు. అలా ఎందుకు ఉండకూడదని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఒక రిస్క్ తీసుకునే ఇలాంటి పాత్రలు చేస్తున్నా. ఏదైనా సరే నేను క్రియేటివ్ యాంగిల్‌లోనే చూస్తా. 

నేను జనరల్ ఫిజీషియన్‌ని. కోవిడ్‌కి ముందు ఆపేశా. ఇప్పుడు పూర్తిగా నటనతోనే బిజీగా ఉన్నా. అయితే, నేను పనిచేస్తున్న సినిమా సెట్‌లో డాక్టర్‌గానూ నా సేవలు పొందుతున్నారు (నవ్వుతూ). ఇండియన్ సినిమాలో పారామెడికల్ కల్చర్ తక్కువ. ఆ కల్చర్‌ను తెలుగు సినిమాలో తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇక నా కొత్త సిని మాలంటే.. -ప్రస్తుతం డెకాయిట్ షూటింగ్ జరుగుతోంది. ఇంకో పెద్ద సినిమా ఉంది. అది మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఇంకా ‘పొలిమేర 3’ కూడా మొదలుపెట్టాలి.