calender_icon.png 17 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 50 వేల కోట్ల రక్షణ బడ్జెట్!

17-05-2025 01:24:13 AM

  1. మరింత పెరగనున్న త్రివిధ దళాల సామర్థ్యం
  2. సాంకేతికత, నూతన ఆయుధాల కొనుగోలుపై ఖర్చు!
  3. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదనపు పద్దుకు ఆమోదం! 

న్యూఢిల్లీ, మే 16: ఆపరేషన్ సిందూర్ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న మన త్రివిధ దళాలకు కేంద్రం మరో శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. త్రివిధ దళాల రక్షణ బడ్జెట్‌కు రూ. 50 వేల కోట్ల మేర అదనపు కేటాయింపులు చేపట్టాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ దిశగా ఇప్పటికే సన్నాహకాలు కూడా ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏడు రక్షణ శాఖ కు బడ్జెట్‌లో రూ. 6.81 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు 9.53 శాతం అధికం. ఈ అదనపు కేటాయింపులకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.

ఈ పెంపు కనుక పూర్తుతై మన దేశ రక్షణ శాఖ బడ్జెట్ రూ. 7 లక్షల కోట్ల మార్క్ దాటనుంది. ఈ అదనపు కేటాయింపులతో సాం కేతికత, పరిశోధన, అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది.  

ఎన్డీయే వచ్చాక.. 

కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ శాఖ బడ్జెట్ క్రమంగా పెరుగుకుంటూ పోతుంది. గడిచిన పదేండ్లలో మన దళాల సామర్థ్యంతో పాటు కేటాయింపులు కూడా రాకెట్ స్పీడ్‌తో పెరిగాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్ రూ. 2.29 లక్షల కోట్లుగా ఉండేది.

ఈ సంవత్సరం ఆ కేటాయింపులు రూ. 6.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్‌లో రక్షణ శాఖ కేటాయింపులు 13.45 శాతం ఉండటం గమనార్హం.