calender_icon.png 5 May, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది గవ్వల దీవి

04-05-2025 12:00:00 AM

సెనగల్‌లో ఉన్న ఫాడియౌత్ గ్రామంలోకి వెళితే.. గవ్వలే స్వాగతం పలుకుతాయి. రహదారుల వెంట గవ్వలు రాశులు పోసి ఉంటాయి. ఫాడియౌత్ ఒక చిన్న దీవి. జోల్ అనే ఊరు పక్కనే ఉంటుంది. జోల్ కు ఫాడియౌత్ కు మధ్య 800 కిలోమీటర్ల మేర కలప వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటితే ఫాడియౌత్ కు చేరుకోవచ్చు. చేపలు పట్టడం స్థానికుల ప్రధాన జీవన ఆధారం. గాలం, వలలు లేకుండానే మహిళలు కేవలం చేతులతో చేపలు పడుతుంటారు. 

ఈ దీవి విశేషం ఏమిటంటే.. మొలస్కా జాతికి చెందిన జీవులను గ్రామస్థులు సాగు చేస్తుంటారు. ఆల్చిప్పలు, గవ్వలు, నత్తలు వంటివి మొలస్కా జాతికి చెందిన జీవులు. వీటిని ’షెల్ ఫిష్‘ లని పిలుస్తారు. ఆహారం కోసం వాటి మాంసం తీసుకుని ఖాళీ గవ్వలు, ఆల్చిప్పలను బయటే పడేస్తుంటారు. కొన్ని తరాలుగా ఇక్కడి ప్రజలు ఈ పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అలా వాళ్లు పడేసిన గవ్వలతో ఊరంతా గవ్వలమయంగా మారింది.

రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, ఇంటి గోడలు, వాకిట్లో.. ఎక్కడ చూసినా గవ్వలే ఉంటాయి. చివరికి శ్మశానంలో కూడా గవ్వలు కుప్పులు కుప్పలుగా కనిపిస్తాయి. కొన్ని సమాధులను గవ్వలతోనే కట్టడాన్ని చూడొచ్చు. వీధులన్నీ పొరలు, పొరలుగా గవ్వలతో నిండి ఉంటాయి. ఇంటి గోడల్ని సైతం గవ్వలతో అలంకరిస్తారు. దాంతో గోడలన్నీ ఆకర్షణీయ ంగా కనిపిస్తాయి. 

స్థానికులు మొలస్కా జాతికి చెందిన జీవులను తిని, వాటి అవశేషాలను బయట పారేయడంతో, ఏళ్ల తరబడి బలమైన గవ్వలు, ఆల్చిప్పలు, నత్త గుల్లలు అలా పేరుకుపోతూ వచ్చాయి. ఫలితంగా దీవిలో ఎటు చూసినా గవ్వలే కనిపిస్తుంటాయి. విశేషమేమిటంటే ఈ గవ్వలే చివరికి ఆ ఊరిని పర్యాటక ప్రదేశంగా మార్చాయి. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఈ వింత దీవిని చూడటానికి వస్తుంటారు. వారికి దారివెంట గవ్వలు స్వాగతం పలుకుతాయి. 

ఫాడియౌత్ జనాభాలో క్రిస్టియన్లే ఎక్కువ. కొద్ది సంఖ్యలో ముస్లింలు కూ డా ఉన్నారు. ఈ దీవిలో ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. అయితే అన్ని మతాల వారు దీన్ని ఉపయోగించుకుంటుంటారు. అందరూ తమ తమ మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

అయితే అందరూ సమాధులను పూడ్చడానికి, అలంకరించడానికి ఈ గవ్వల్నే వినియోగిస్తారు. మరో విశేషమేమిటంటే ఈ దీవిలో మోటారు బైక్ లు, ఆటోలు, కార్లు అస్సలు కనిపించవు. రవాణా కోసం గాడిదలు లాగే బండ్లను మాత్రమే ఉపయోగిస్తుంటారు. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న గవ్వల కారణంగా ఈ దదీవిని ’సీషెల్ ఐలాండ్‘ అని కూడా పిలుస్తుంటారు.