calender_icon.png 20 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్య సంరక్షణకు అంకితమవుదాం

19-06-2024 12:05:00 AM

బీమా నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే వ్యక్తులకు 65 ఏళ్ల వయస్సు పరిమితిని తొలగించింది. ఇది అత్యంత హర్షించదగ్గ విషయం. ఈ సంస్థ మరోవైపు ప్రజలు సమగ్ర ఆరోగ్య వైద్య సదుపాయాలు పొందడానికి విశేషంగా తోడ్పడుతుంది. మరింత అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రీమియం చెల్లింపుల విషయంలోనూ సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలి. 

‘ప్రజలందరూ ఆరోగ్యంతో జీవించటం అనేది ఒక హక్కు’ అని ఐక్యరాజ్యసమితి తెలుపుతున్నది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా సౌకర్యం కల్పిస్తే అధిక సంఖ్యలో ప్రజలు ఆకర్షితులవుతారు. ఆరోగ్య బీమా తీసుకున్న ప్రతి వ్యక్తీ రోగాల బారిన పడడు. అందువల్ల, బీమా కంపెనీలకు ఎటువంటి నష్టాలూ రావు. కేవలం, అనారోగ్యంగా ఉన్నవారికే బీమా పథకాలు ఉపయోగపడతాయి. మరోవైపు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వివిధ రోగాలకు అందిస్తున్న చికిత్సలపైనా అధికారులు నియంత్రణ పెట్టాలి. అత్యుత్తమ చికిత్సలు అందేలా చూడాలి.

ఒక రోగ చికిత్సకు ఒకే విధమైన ఫీజును అన్ని హాస్పిటల్స్‌లో ఉండేటట్టు చూడాలి. రోగం ఒక్కటే, హాస్పిటల్ డాక్టర్ వేరే అయినంత మాత్రాన వివిధ రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా రోగ నిర్ధారణ పరీక్షలు కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. వీటిని తగ్గించాలి. ఈ హాస్పిటల్స్‌లో ఒకసారి వైద్యం కోసం వెళ్ళినప్పుడు డాక్టరు మందులు ఆయా రోగాలనుబట్టి వారం, నెల వరకు ఇతరత్రా రాస్తుంటారు. కానీ, ఆయా కార్పొరేట్ హాస్పిటల్స్/ వివిధ క్లినికుల స్థాయినిబట్టి ఒక వారం లేదా పది రోజుల్లో మరొకసారి ఉచితంగా వైద్యసేవలు పొందుటకు వీలు కల్పిస్తున్నారు.

ఒకపక్క  నెల, రెండు నెలల కోసం మందులు రాస్తూ వారం, పది రోజుల్లో వైద్య సహాయం ఉచితంగా పొందాలని నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉంటున్నది. డాక్టరు నిర్ధారించిన ప్రకారం మందులు వాడితేనే రోగం సంగతి తెలుస్తుంది. కానీ, వారం, పది రోజులలో మాత్రమే ఉచితంగా వైద్య సలహాలు పొందడానికి వీలు కల్పించడం కంటి తుడుపు చర్య మాత్రమే. కార్పొరేట్ వైద్యశాల హాస్పిటల్స్‌లో వారంలో ఒకసారి అందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి.

జనరిక్ మందుల దుకాణాలు కూడా ఏర్పాటు చేసి, వాటిలో అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు ఉండేటట్లు చూడాలి. ఒక రోగానికి ఇంజక్షన్లను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇవి తీసుకోవటానికి ప్రతి ఇంజక్షన్‌కు వంద రూపాయలు వివిధ వైద్యశాలల వారు వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్  హాస్పిటల్ తరహాలో ప్రభుత్వ దవఖానాలలో వైద్య సౌకర్యాలు విస్తృత స్థాయిలో కల్పించాలి. 

 -దండంరాజు రాంచందర్ రావు